ఖబ్జా కోరల్లో కొండలు
బిజినేపల్లి, అక్టోబర్ 12: మండల వ్యాప్తంగా ఉన్న రాళ్ల గుట్టలపై కబ్జాదారుల కన్ను పడిందంటూ ఇప్పటికే విజయక్రాంతిలో కథనం ప్రచురితమైనప్పటికీ, రెవెన్యూ శాఖలో మాత్రం ఎలాంటి కదలిక కనిపించడం లేదు. లట్టుపల్లి పాత గ్రామ పంచాయతీ పరిధిలోని తండాల్లో రాళ్ల గుట్టలను మాయం చేస్తూనే, మరోవైపు సుమారు 40 ఎకరాల భూమిని చదును చేసి వ్యవసాయ పొలాలుగా మారుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ భూముల్లోని కొండలను కబ్జా చేసేందుకు కొందరు ప్రత్యేకంగా హిటాచీ, జేసీబీ వంటి యంత్రాలను కొనుగోలు చేస్తుండగా, మరికొందరు కోళ్ల షెడ్లను నిర్మించుకుంటున్నారు. వీటికి ప్రభుత్వ అనుమతులు లేవనే ఆరోపణలు ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారుల అండదండలతోనే రాళ్ల గుట్టలు, కొండలు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీలో ఉంటే అధికారులు, ప్రతిపక్షాలు, కుల సంఘాలు ఎవరూ తమ కబ్జాలు, ఆక్రమణలకు అడ్డురారనే ధీమాతో లట్టుపల్లికి చెందిన ఓ ప్రధాన గిరిజన నాయకుడు చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చిన్న సారు, పెద్ద సారు అంటూ స్థానికుల నోళ్లు మూయిస్తూ ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అండతోనే ఈ ఆక్రమణల పర్వం సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొండలను కబ్జా చేస్తున్నారని లట్టుపల్లి తండాకు చెందిన ఓ గిరిజన యువకుడు 2026 మార్చి 7వ తేదీన బిజినేపల్లి తహసీల్దారుకు ఫిర్యాదు (Complaint) చేశాడు. అయినప్పటికీ ఈ విషయంలో అధికారుల చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫిర్యాదు చేసిన ప్రాంతంలోనే మరింత యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణల గురించి ఆరా తీస్తే, అధికారులకు చెప్పాల్సింది చెప్పడంతోపాటు ఇవ్వాల్సింది కూడా ఇచ్చుకున్నామని కొందరు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ అధికారులకు డబ్బులు ముట్టజెప్పితే ఫిర్యాదులు సైతం చెత్తబుట్టలోకి వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ (Investigation) జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయమై బిజినేపల్లి తహసీల్దారు ఎండీ మున్నిరుద్దీన్‌ను వివరణ కోరగా, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు గుర్తించి హెచ్చరించామని తెలిపారు. తమపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఆక్రమణలపై సంబంధిత అధికారులు సమగ్ర పరిశీలన (Field Inspection) జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.