రాహుల్ గాంధీ కొత్త అస్త్రం
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోషల్ మీడియా(Social Media) వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. ఈసారి ఆయన తన విమర్శలకు అర్ధనారీశ్వరుడి రూపాన్ని వేదికగా చేసుకున్నారు. శివుడు, పార్వతీదేవి ఏకరూపంగా దర్శనమిచ్చే అర్ధనారీశ్వరుడి శిల్పాన్ని ఎక్స్‌లో షేర్ చేస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారతీయ ఆధ్యాత్మిక, మత సంప్రదాయాలను ఎంత లోతుగా అధ్యయనం చేస్తున్నానో.. అంత స్పష్టత వస్తోందంటూ రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు(BJP and RSS leaders) భారతీయ ఆధ్యాత్మిక, మత సంప్రదాయాలపై(Indian spiritual and religious traditions) కనీస అవగాహన లేదని ఆరోపించారు. అంతేకాదు.. వారిని అనాగరికులు, అత్యాశాపరులు, కులవాదులు, పురుషాధిక్య భావజాలం కలిగినవారంటూ ఘాటుగా విమర్శించారు.
తన తల్లి సోనియా గాంధీ(Sonia Gandhi) పుస్తకం 'Belonging: A Journey Of Love' ఆవిష్కరణ కార్యక్రమంలో తల్లిదండ్రుల అనుబంధం గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల రాజకీయ విమర్శలు వచ్చాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆయన ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రేమ, అనుబంధం గురించి సోషల్ మీడియాలో స్పందించారు.