క్షమాపణ కోరుతూ..కేటీఆర్‌కు నాయిని డిమాండ్

22-11-2026 | 05:03pm

హనుమకొండ, నవంబర్ 22 (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు (Political Criticism) గుప్పించారు. వరంగల్ గడ్డపై అడుగుపెట్టే ముందు జిల్లా ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం (Compensation) అందిస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత పట్టించుకోకుండా మోసం చేశారని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వరంగల్‌కు వస్తున్నారని నాయిని ప్రశ్నించారు. వరద బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రాజకీయ పర్యటనలు చేయడం ఏమిటని నిలదీశారు. ఇక బీఆర్ఎస్‌లో జరుగుతున్న చేరికలపైనా నాయిని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దసరా పండుగకు యాటపోతును తీసుకొచ్చినట్లు కొత్తవారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ చేరికల (Political Joinings) పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

వరంగల్ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలకు సమాధానం చెప్పకుండా రాజకీయ సభలు నిర్వహిస్తే ప్రజలు ఎలా నమ్ముతారని నాయిని ప్రశ్నించారు. ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే వరంగల్‌లో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు