88 రోజుల రికార్డు.. పార్లమెంట్లో సరికొత్త చరిత్ర
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన లోక్సభ, రాజ్యసభలు సోమవారం నాటికి కూడా అధికారికంగా ప్రోరోగ్ (Parliament Prorogation) కాకపోవడంతో సమావేశాల కాలవ్యవధి 88 రోజులకు చేరింది. దీంతో 2008లో నమోదైన 87 రోజుల రికార్డు చెరిగిపోయింది.
సాధారణంగా సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత అధికారికంగా ప్రోరోగ్ చేస్తారు. అయితే ఈసారి ఆ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో పార్లమెంట్ సమావేశాల కాలవ్యవధి (Parliament Session Duration) కొత్త రికార్డును సృష్టించింది. ఈ పరిణామం రాజకీయ, పార్లమెంటరీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill), లోక్సభ స్థానాల పెంపునకు సంబంధించిన బిల్లులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు (Special Parliament Session) నిర్వహించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు ఈ చర్చలకు మరింత ఊతమిస్తున్నాయి.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిర్దిష్టమైన ముందస్తు గడువు తప్పనిసరి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాల దిశగా అడుగులు వేస్తుందా? మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు బిల్లులను ఎప్పుడు ముందుకు తీసుకొస్తుంది? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.