6 September, 2026 | 1:37 PM

కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి

06-09-2026 | 11:45am

సాగర్: మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) సాగర్ జిల్లాలో ఆదివారం నాడు కల్తీ మద్యం సేవించడం వల్ల 9మంది మరణించగా, పలువురు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. తలనొప్పి, వాంతుల సమస్యతో బాధపడుతున్న బాధితులను బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు(Bundelkhand Medical College and Hospital) తరలించారు. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందా తహసీల్‌లోని రెండు గ్రామాల్లో వీరు ఆ మద్యం సేవించారని అధికారులు తెలిపారు. "అక్రమ, కల్తీ మద్యం సేవించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని స్థానికులతో జరిపిన సంభాషణల ద్వారా తెలిసింది. ఆ రెండు గ్రామాల్లో ఇప్పటికే ఆరోగ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి." అని సాగర్ కలెక్టర్ ప్రతిభా పాల్(Sagar Collector Pratibha Pal) మీడియాతో చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

విషపూరిత మద్యం సేవించినట్లు అనుమానిస్తున్న ఘటనపై సాగర్ సీఎంహెచ్ఓ(Sagar CMHO) దేవేష్ పటేరియా మాట్లాడుతూ, "ఇప్పటివరకు 9-10 మంది మరణించారు. మా వైద్యులు, నర్సుల బృందాలు ప్రభావితమైన మూడు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేస్తూ, రోగులను గుర్తిస్తూ నిరంతరం పనిచేస్తున్నాయి. లక్షణాలు మిథైల్ ఆల్కహాల్ విషప్రభావాన్ని సూచిస్తున్నాయి, కానీ ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. అవసరమైతే తదుపరి చికిత్స కోసం పంపే ముందు, రోగుల పరిస్థితిని ఇక్కడ స్థిరీకరిస్తున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది." అని సీఎంహెచ్ఓ పేర్కొన్నారు.


మరిన్ని వార్తలు