ఏజెన్సీలో ప్రబులుతున్న వైరల్ జ్వరాలు
ఇంద్రవెల్లి మండలం శంకర్ గూడా గ్రామంలో డెంగ్యూ కేసు నమోదు..
ఉట్నూర్, సెప్టెంబర్06,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో చాప కింద నీరులా వైరల్ జ్వరాలు(Viral fevers) ప్రబులుతున్నాయి. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ప్రజలు, ముఖ్యంగా వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. ఇంద్రవెల్లి మండలం శంకర్ గూడా గ్రామ పంచాయతీ కేంద్రానికి చెందిన దాసరి శ్రీధర్(6) డెంగ్యూ జ్వరాల బారిన పడ్డారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మండపల్లి గ్రామానికి వెళ్లి అక్కడే జ్వరం బారిన పడ్డారు.
ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. రిమ్స్ ఆస్పత్రిలో(RIMS Hospital) వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ జ్వరం సోకినట్లు గుర్తించారు. రిమ్స్ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు శంకర్ గూడ,మెండపల్లి పంచాయతీ కేంద్రాలలో ఆదివారం వైద్య శిబిరాల నిర్వహించారు. గ్రామపంచాయతీ కేంద్రాలలో మురికి కాలులను శుభ్రం చేయకపోవడంతో దోమలు పెరిగి పోవడంతో ప్రజలు దోమకాటుకు గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్, వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలను జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






