నిమిషాల్లో షోకేస్ ఖాళీ

01-10-2026 | 05:20pm

జైపూర్‌లో దొంగల బీభత్సం.. కోట్ల విలువైన వాచీలు మాయం!

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో తెల్లవారుజామున దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. నగరంలోని రద్దీ ప్రాంతమైన టోంక్ రోడ్డులో ఉన్న రాడో లగ్జరీ వాచ్ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు షట్టర్‌ను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి ప్రీమియం వాచీలను సంచుల్లో నింపుకుని క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. తెల్లవారుజామున ఐరన్ రాడ్లతో షోరూమ్ షట్టర్‌ను ధ్వంసం చేసిన దుండగులు లోపలికి చొరబడ్డారు. అనంతరం షోకేసుల్లో ఉన్న ఖరీదైన గడియారాలను ఒక్కొక్కటిగా సంచుల్లో వేసుకున్నారు. పక్కాగా ప్రణాళిక వేసుకుని వచ్చినట్లు కనిపిస్తున్న నిందితులు.. చోరీ అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో సుమారు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పైగా విలువైన వాచీలు అపహరణకు గురైనట్లు ప్రాథమిక కథనాలు వెల్లడించాయి. అయితే వాస్తవ నష్టం స్టాక్ పరిశీలన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

సీసీటీవీ ఫుటేజీతో నిందితుల కోసం గాలింపు

చోరీ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షోరూమ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ భారీ చోరీతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. కోట్ల విలువైన లగ్జరీ వాచీలను దుండగులు ఎలా తరలించారు? ఈ చోరీ వెనుక ఎంతమంది ఉన్నారు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు