రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ ( విజయక్రాంతి): అనారోగ్యంతో, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదాలకు గురై అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా నిలువవచ్చని, రక్తదానం చేయడంతో శరీరంలో నూతన రక్తం పెంపొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకన్న, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు కిరణ్ , వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.