మాజీ మంత్రికి ఈడీ నోటీసులు

03-11-2026 | 05:18pm

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) చుట్టూ మద్యం కేసు(Liquor Case) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ఆయనకు తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు. నిర్ణయించిన తేదీన తప్పనిసరిగా విచారణకు రావాలని సూచించినట్లు సమాచారం.

ఈడీ అధికారులు గతంలోనే అంబటి రాంబాబును విచారణకు పిలిచారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా హాజరు కాలేనని ఆయన లిఖితపూర్వకంగా తెలియజేశారు. తనకు గుండెకు స్టెంట్లు వేసినట్లు నిర్ధారించే ఆసుపత్రి వైద్య నివేదికలను కూడా ఈడీ కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలో గత నెల 29న ఈ నెల 4న విచారణకు హాజరుకావాలని పేర్కొంటూ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమన్లు పంపినట్లు తెలుస్తోంది.

అయితే ఆ మెయిల్‌ను సకాలంలో గమనించలేకపోయానని అంబటి అధికారులకు వివరించినట్లు సమాచారం. తాజాగా ఈడీ అధికారులు కొత్తగా నోటీసులు జారీ చేసి, విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. అధికారుల తాజా ఆదేశాల నేపథ్యంలో అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యే అవకాశముంది. మద్యం కేసుకు సంబంధించి ఆయన నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

మరిన్ని వార్తలు