పెట్రోల్ ఎగుమతులపై జీరో ట్యాక్స్

31-10-2026 | 05:27pm

అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ (Windfall Gains Tax)ను సవరిస్తూ కొత్త పన్ను రేట్లను ప్రకటించింది. అక్టోబర్ 31 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేయగా, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై పన్నులను పెంచింది.

ఇప్పటివరకు పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.2.50 చొప్పున విధిస్తున్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (Special Additional Excise Duty) కేంద్రం సున్నాకు తగ్గించింది. దీంతో పెట్రోల్ ఎగుమతిదారులకు ఊరట లభించనుంది.

మరోవైపు డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న పన్నును లీటరుకు రూ.8.50 నుంచి రూ.11.50కి పెంచింది. దీంతో ఒక్కో లీటరుపై రూ.3 అదనపు భారం పడనుంది. విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (Aviation Turbine Fuel - ATF) ఎగుమతులపై సుంకాన్ని రూ.10.50 నుంచి రూ.11కు పెంచింది. ఈ సవరణలు అక్టోబర్ 31 నుంచి తదుపరి 15 రోజుల పాటు అమల్లో ఉంటాయి.

తాజా నిర్ణయంతో సామాన్యులకు ఆందోళన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పన్ను సవరణలు విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులకే వర్తిస్తాయని వెల్లడించింది. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో దేశంలోని పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధన ధరలపై ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ఇంధన ఎగుమతుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఎగుమతి సుంకాలను సమీక్షించే విధానంలో భాగంగా తాజా సవరణలు చేపట్టింది.

మరిన్ని వార్తలు