పదేళ్లపాటు పాలనలో ఉండి రేషన్ కార్డులు ఇవ్వలేదు..
- అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
- ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి
మునుగోడు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): గత ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందించలేదని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని రైతువేదికలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు.
అర్హులైన పేద కుటుంబాలకు పారదర్శకంగా ఉచితంగా సన్నబియ్యం అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు తహశీల్దార్ నరేష్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.