భూ రీసర్వేతో మ్యాపుల ఏర్పాటు
బిజినేపల్లి, సెప్టెంబర్ 30 : భూములను సమగ్రంగా సర్వే చేసి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వాటి హద్దులను గుర్తించి మ్యాపులను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(District Collector Hemant Keshav Patil) తెలిపారు. బుధవారం మండలంలోని ఖానాపూర్‌లో భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, రైతులతో మాట్లాడి సర్వే పురోగతిపై ఆరా తీశారు.
స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి రీ సర్వే ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖానాపూర్ గ్రామ పరిధిలో మొత్తం 2,525 ఎకరాల 15 గుంటల భూములను రీ సర్వే ప్రక్రియలోకి తీసుకున్నామని, ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు, హద్దుల విషయంలో తలెత్తే సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.