పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం

23-10-2026 | 08:33pm

ఎస్ఐ చల్లా రాజు

వెంకటాపూర్, అక్టోబరు 23 (విజయక్రాంతి): ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసేవలో పోలీసులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని వెంకటాపూర్ ఎస్ఐ చల్లా రాజు(Venkatapur SI Challa Raju) అన్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులు యువకులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ చల్లా రాజు మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని, విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. సమాజంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బందిలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు