మారుతున్న ‘హస్త’ రేఖలు..?
- పెత్తనాలతో పార్టీకి తలనొప్పులు.?
- ప్రజాసేవ పక్కకు..పెత్తనాలే ముందుకు.?
- పార్టీ నేతలపై వెల్లువెత్తుతున్న విమర్శలు.?
- తమకు అనుకూలంగా పనిచేయకపోతే అధికారులపై ఆగ్రహం.!
- పార్టీకి మచ్చ తెస్తున్న నేతలు..?
వెంకటాపూర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): స్థానిక పాలనలో(Local Governance) ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం.. ప్రజలు ఎన్నుకున్న నాయకులు గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మహిళా సర్పంచుల భర్తల జోక్యం, అధికారులపై ఆధిపత్య ధోరణి, తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే దూషణలకు దిగుతున్నారనే ఆరోపణలు మండలంలో చర్చకు దారితీస్తున్నాయి.
ప్రజాసేవ చేయాల్సిన చోట వ్యక్తిగత పెత్తనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.? నాయకత్వం ఈ వ్యవహారాలపై దృష్టి సారిస్తుందా.? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అధికారులపై పెత్తనం.. దూషణలతో వివాదాలు..!
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే కొందరు మహిళా సర్పంచుల భర్తలు అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటూ, తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
అధికారులు మాట వినకపోతే దూషణలకు దిగిన ఘటన కూడా ఇటీవలే పలు గ్రామపంచాయతీల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనల వల్ల మండలంలో విమర్శలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ధోరణులు పాలనాపరమైన సమన్వయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళా ప్రాతినిధ్యానికి అర్థం ఇదేనా..?
మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనుక ఉద్దేశం వారిని నాయకత్వంలోకి తీసుకురావడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించడం. అయితే కొన్ని గ్రామపంచాయతీల్లో మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు మండలంలో తావిస్తున్నాయి. గ్రామ పాలనలో సర్పంచులే కీలక పాత్ర పోషించాలని, కుటుంబ సభ్యుల జోక్యం అధికారిక బాధ్యతలను మించకూడదనే పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రజల్లో పలుచబడుతున్న ఆదరణ..?
కాంగ్రెస్ పార్టీలో నేతల వ్యవహారశైలిపై మండల వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన నాయకులు ఆధిపత్య ధోరణికి పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన నేతలు పెత్తనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీపై ఆశలు పెట్టుకున్న ప్రజలు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా మార్పు వస్తుందా.?
ప్రజలు ఎన్నుకున్నది సర్పంచ్‌ను తప్ప, ఆమె భర్తను కాదనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారిక బాధ్యతలు లేని వ్యక్తులు పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు నిజమైతే వాటిపై విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా కొందరు నేతలు,
ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల వ్యవహారశైలి పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెస్తోందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం స్పందించి, ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.