కాలువలు కట్టారు.. మట్టి నింపడం మరిచారు
వెంకటాపూర్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సైడ్ కాలువల నిర్మాణం చేపట్టినప్పటికీ, వాటి పక్కన మట్టిని నింపకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి కాడపాక శ్యామ్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ.. కాలువల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటి పక్కన మట్టిని నింపి, రోడ్డు అంచులను సరిచేయాల్సి ఉన్నప్పటికీ సంబంధిత పనులు చేపట్టకపోవడంతో నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు. మట్టి లేకపోవడంతో ప్రజలు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో, నాణ్యతతో నిర్వహించాలని సూచించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సైడ్ కాలువల పక్కన మట్టిని నింపి, రోడ్డు అంచులను సరిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని శ్యామ్ మాదిగ డిమాండ్ చేశారు.