మహారాజాపై హాలీవుడ్ స్టార్ ప్రశంసలు
విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజా’ సినిమాను హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్(Tom Hanks) వీక్షించారు. అంతేకాదు.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన యువ నటి సచనా నామిదాస్(Sachana Namidas) నటనకు ఆయన ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 2024లో విడుదలైన తమిళ చిత్రం ‘మహారాజా’కు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నటరాజ్ సుబ్రమణ్యం, సచనా నామిదాస్ కీలక పాత్రలు పోషించారు.
వైవిధ్యమైన కథనం, అనూహ్యమైన మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది లాస్ ఏంజిల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (లాక్మా)లో జరిగిన ఓ కార్యక్రమంలో టామ్ హ్యాంక్స్.. ‘ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డ్’ సభ్యురాలు కవితా గుప్తాను కలిశారు. ఈ సందర్భంగా భారతీయ సినిమాల్లో చూడదగిన మూడు చిత్రాలను సిఫార్సు చేయాలని కోరారు. దీంతో ఆమె ‘మహారాజా’ను సూచించారు. ఆ తర్వాత నవంబర్ 7న జరిగిన మరో ‘లాక్మా’ ఆర్ట్ అండ్ ఫిల్మ్ గాలాలో టామ్ హ్యాంక్స్ను కవితా గుప్తా మళ్లీ కలిశారు.
అప్పుడు ఆయన స్వయంగా ‘మహారాజా’ సినిమా గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా అందులో జ్యోతి పాత్రలో నటించిన సచనా నామిదాస్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. సచనా నటన గురించి టామ్ హ్యాంక్స్ స్పందిస్తూ.. “ఆ అమ్మాయి నటనను నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా. ఎంత అద్భుతమైన నటి! ఆ పాత్రలోని పరిస్థితిని నేను చేయలేనేమో. నేనైతే ఆ వ్యక్తిని చంపేసేవాడినేమో!” అని అన్నట్లు కవితా గుప్తా వెల్లడించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కుమార్తె జ్యోతి పాత్రలో సచనా నటించారు.
ఆమె నటనకు జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో ఆమె ప్రతిభకు జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది. మరోవైపు ‘మహారాజా’ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఇంగ్లిష్ రీమేక్‌లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని విజయ్ సేతుపతి ఇప్పటికే తన ఆసక్తిని వ్యక్తం చేశారు. అలాగే ‘మహారాజా 2’ కథను దర్శకుడు నితిలన్ స్వామినాథన్ తనకు వినిపించారని, ఆ కథ అద్భుతంగా ఉందని విజయ్ సేతుపతి వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.