వ్యవహారం వెనుక..!
టాలీవుడ్లో ప్రస్తుతం హీరో శర్వానంద్(Sharwanand), హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య కనిపిస్తున్న సాన్నిహిత్యం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి నటించిన ‘భోగి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రమోషనల్ కార్యక్రమాల్లో వీరి వ్యవహారశైలి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుకలో డింపుల్ హయాతి.. శర్వానంద్‌ను ఆప్యాయంగా హత్తుకోవడం, ఆయన భుజంపై తలవాల్చి నవ్వుతూ మాట్లాడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరోవైపు ‘భోగి’ మ్యూజికల్ నైట్‌లో వేదికపైనే ‘డింపుల్.. లవ్ యూ ఆల్వేస్’ అంటూ శర్వా వ్యాఖ్యానించడం అభిమానులను ఆకట్టుకుంది. డింపుల్‌ను చూస్తేనే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందని, ఆమె సెట్లోకి రాగానే చుట్టూ మంచి వాతావరణం ఏర్పడుతుందని శర్వా చెప్పుకొచ్చారు. అందరినీ ఎంతో కంఫర్టబుల్‌గా ఉంచే వ్యక్తిత్వం ఆమెదని ప్రశంసించారు. అయితే, శర్వానంద్ వ్యక్తిగత జీవితం గురించి కొంతకాలంగా సాగుతున్న ప్రచారం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
ఆయన భార్య రక్షితారెడ్డితో విభేదాలు వచ్చాయని, ఇద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. శర్వా తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫొటోలను తొలగించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే వీరి విడాకుల వ్యవహారంపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఇక డింపుల్ వైవాహిక జీవితంపై కూడా గతంలో పలు ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అంటూ డింపుల్ నవ్వుతూ సమాధానమిచ్చారు. తాజా చర్చపై దర్శకుడు సంపత్ నంది కూడా స్పందించారు. సినిమా షూటింగ్ సమయంలో సహనటుల మధ్య మంచి స్నేహం ఏర్పడటం సహజమని వివరించారు. మొత్తానికి శర్వా, డింపుల్ మధ్య ఉన్నది సహజమైన స్నేహమా? లేక ప్రమోషన్లలో భాగంగా కనిపిస్తున్న ప్రత్యేకమైన కెమిస్ట్రీనా? అన్న చర్చ మాత్రం కొనసాగుతోంది.