తెలంగాణ రైతులకు డీకే హామీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రుల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka CM DK Shivakumar)ను కలిశారు. డీకే శివ కుమార్ ను కలిసిన వారిలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డిలు ఉన్నారు. కృష్ణా జలాలు, నారాయణపూర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతుల పరిస్థితిని డీకేకు నేతలు వివరించారు. జూరాల(Jurala Project), భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టు పంటలను కాపాడాలని కోరారు. 4 ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు.
ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని పంటలు కీలక దశలో ఉన్నాయని మంత్రులు సూచించారు. నీటి కొరత వస్తే పంట దిగుబడి, రైతుల ఆదాయం, జోవనోపాధిపై ప్రభావం పడుతోంది తెలిపారు. నెల రోజులు 5 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నీటిని విడుదల చేస్తే కీలక దశలో ఉన్న పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. పొరుగు రాష్ట్రాల సహకార స్ఫూర్తితో నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ మంత్రుల(Telangana Ministers) విజ్ఞప్తికి కర్నాటక సీఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు.