అవన్నీ నాకు తెలుసు!
‘రామాయణ’ సినిమాలో సీతమ్మ పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి(Actress Sai Pallavi) తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై స్పందించింది. ముఖ్యంగా సీతమ్మ పాత్రకు తన రూపం సరిపోతుందా? లేదా? అంటూ వస్తున్న కామెంట్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. “సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలియదని అనుకోవద్దు. అక్కడ వస్తున్న ప్రతి విషయాన్ని నేను గమనిస్తూనే ఉంటా. ‘సీతమ్మ ఇంత అందంగా ఉండాలి.. అలా ఉండాలి’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
అవన్నీ నా దృష్టికి వస్తున్నాయి. అయితే ఇలాంటి అభిప్రాయాలు మనల్ని మన అంతరంగంలో కదిలిస్తే, లోపం మనలోనే ఉన్నట్లు. అలాంటప్పుడు మనం మరింత బలంగా మారాలి. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండగలడో అంతకంటే ఎక్కువగానే నేను ఉన్నా. ఎవరి అభిప్రాయాలు వారివి. మనలో ఏవైనా అభద్రతాభావాలు ఉంటే వాటిని అధిగమించాలి. మనసులో దృఢంగా ఉంటే మిగతా ప్రపంచాన్ని ఎదుర్కోవచ్చు. లేదంటే ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లొచ్చు.
సీత పాత్రలో నటించడం నా జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఆ పాత్రలోని కొన్ని భావాలను నా మనసులో మోస్తున్నా. అయితే అవన్నీ చాలా వ్యక్తిగతమైనవి. వాటి గురించి ప్రపంచానికి వివరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నా” అని చెప్పింది సాయిపల్లవి. ముంబైలో జరిగిన ‘వీ ది విమెన్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. సాయిపల్లవి వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.