బ్రాహ్మణ సంఘాల ఐక్యతకు కృషి చేయాలి
- సమాజ ఐక్యతతోనే సామాజిక, ఆర్థికాభివృద్ధి
- సంక్షేమ పథకాలను హక్కుగా వినియోగించుకోవాలి
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ముషీరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): బ్రాహ్మణ సమాజం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సంఘాలు, ఫెడరేషన్లు ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (IT Minister Dudilla Sridhar Babu) అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు హక్కుగా వినియోగించుకోవాలన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బ్రాహ్మణ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బ్రాహ్మణ సమాజంలోని వివిధ సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈబీసీ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు అర్హులు సంకోచించవద్దని, వాటి ద్వారా ప్రభుత్వ పథకాలు, విద్యా అవకాశాలు, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రయోజనాలు పొందవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ధర్మాన్ని, బ్రాహ్మణ సమాజ సంప్రదాయాలను, విలువలను కాపాడటం ద్వారా సమాజానికి గౌరవం పెరుగుతుందన్నారు.
భావితరాలకు బ్రాహ్మణ సమాజ విలువలు, బాధ్యతలను తెలియజేసే కార్యాచరణ రూపొందించాలని సంఘాల నాయకులకు సూచించారు. బ్రాహ్మణ మహిళలు వ్యాపార రంగంలో, స్వయం ఉపాధి కార్యక్రమాల్లో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సమాజ అభివృద్ధికి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఐక్యతతో కృషి చేయాలని, బ్రాహ్మణ సంఘాలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే చట్ట పరిధిలో పరిష్కారానికి సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ బ్రాహ్మణులు బహుజన ప్రియులని అన్నారు. బ్రాహ్మణులు సమాజ వ్యతిరేకులు కారని, అందరి సంక్షేమం కోసం పాటుపడతారన్నారు. బ్రాహ్మణుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, దీన్ని బ్రాహ్మణులు ముక్తకంఠంతో పండించాలన్నారు.భారతీయ సంస్కృతిని కాపాడేది బ్రాహ్మణులేనని నొక్కి చెప్పారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పండిట్ ఎస్‌డీ శర్మ, సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్, ఫెడరేషన్ ఆల్ ఇండియా ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఇన్చార్జి నైజం సత్యనారాయణ, బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్, మాజీ చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కోశాధికారి ధ్రువ నారాయణ శర్మ, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, ఫెడరేషన్ ఏపీ సలహాదారు కృష్ణమోహన్, రాధాకృష్ణ, మంత రమణమూర్తి, మంగపతిరావు, శ్రీనివాస్, వారణాసి వంశీ, పీఎస్‌ఎస్వీ ప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత నాగ బాల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.