లక్నవరంపై ఎల్ నినో దెబ్బ!

29-11-2026 | 05:15am

ప్రకృతి అందాలకు అద్దం పట్టే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు(Laknavaram Lake) ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో కళావిహీనంగా మారుతోంది. పచ్చని కొండల నడుమ విస్తరించిన జలరాశి, ఆహ్లాదకరమైన వాతావరణం, కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఈ పర్యాటక కేంద్రం నేడు నీటి కొరతతో వెలవెలబోతోంది. సాధారణంగా నిండుకుండలా దర్శనమిచ్చే సరస్సులో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో జలకళ కనుమరుగవుతోంది.

ఫలితంగా సరస్సు అందాలు మసకబారడమే కాకుండా పర్యాటక కార్యకలాపాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతలు జలవనరులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లక్నవరం సరస్సులో నీటి నిల్వలు తగ్గి పర్యాటక రంగానికి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి.

తగ్గిన జలకళ.. మసకబారిన అందాలు

ములుగు జిల్లా పర్యాటక రంగానికి మణిహారంగా నిలిచే లక్నవరం సరస్సు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో విశాలమైన జలరాశి, సరస్సుపై విస్తరించిన వేలాడే వంతెన పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. అయితే ప్రస్తుతం నీటి నిల్వలు తగ్గడంతో గతంలో కనిపించిన జలసోయగం కనుమరుగవుతోంది. సరస్సులో నీరు తగ్గిన ప్రాంతాల్లో మట్టి నేలలు బయటపడుతుండటంతో ప్రకృతి సౌందర్యానికి విఘాతం కలుగుతోంది.

పర్యాటకులు కెమెరాల్లో బంధించాలనుకునే ఆహ్లాదకరమైన జలదృశ్యాలు కనుమరుగవుతుండటంతో పర్యాటక కేంద్రం మునుపటి కళను కోల్పోతోంది. లక్నవరం పర్యాటక ఆకర్షణల్లో బోటింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సరస్సు అందాలను నీటిపై విహరిస్తూ ఆస్వాదించేందుకు పర్యాటకులు అధిక ఆ సక్తి చూపుతుంటారు. నీటిమట్టం తగ్గడంతో బోటింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పర్యాటకుల సందడి తగ్గడమే కాకుండా పర్యాటక సౌకర్యాల నిర్వహణపైనా ఒత్తిడి పెరుగుతోంది. 

గోదావరి జలాలు తరలిస్తేనే..

లక్నవరం చెరువు కింద సుమారు 8,700 ఎకరాలు అధికారికంగా సాగుతుండగా అనధికారికంగా 12వేల ఎకరాలకు పైగానే రైతులు సేద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి జలాలు లక్నవరం చెరువులోకి మల్లిస్తే అన్నదాతలకు రెండు పంటలు పండడంతో పాటు పర్యాటక రంగంగా తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. కేవలం ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జీవనాధారం కూడా. అందుకే సరస్సుకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా పాలకులు, అధికారులు, పర్యాటక శాఖ తక్షణమే కార్యాచరణ రూపొందించాలి.

 అంకం వినయ్ కుమార్, ములుగు, విజయక్రాంతి

తగ్గిన పర్యాటకులు.. ఉపాధి

పర్యాటకుల రాకపోకలపైనే ఆధారపడి జీవనం సాగించే స్థానిక చిరు వ్యాపారులు, హోటళ్లు, అల్పాహార కేంద్రాలు, ఇతర వ్యాపార వర్గాలపై ఈ పరిణామం ప్రభావం చూపుతోంది. పర్యాటకుల సంఖ్య ఇటీవల భారీగా తగ్గి వారి ఆదాయానికి గండిపడే పరిస్థితి ఏర్పడుతోంది. పర్యాటక కేంద్రం కళ తప్పితే దాని ప్రభావం కేవలం సందర్శకులకే పరిమితం కాకుండా స్థానిక ఉపాధి అవకాశాలపైనా పడుతుంది. ఇప్పటికే ప్రకృతి పర్యాటకాన్ని నమ్ముకుని జీవిస్తున్న పలువురికి లక్నవరం సరస్సు నీటి కొరత ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు