కొడంగల్‌లో రూ.60 కోట్ల భూ దందా!

29-11-2026 | 05:10am
  1. హకీంపేటలోనూ భూ అక్రమాలు  
  2. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో(Kodangal Constituency) రూ.60 కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. హకీంపేటలో అసైన్డ్ భూములకు సంబంధించి సర్వే నంబర్లలో అక్రమంగా బై నంబర్లు సృష్టించి, భూమి విస్తీర్ణాన్ని పెంచి చూపిస్తూ పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో ఆయన మీడియాతో మాట్లాడారు. 252/10 సర్వే నంబర్‌లో బై నంబర్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని, వాస్తవంగా 300 ఎకరాల భూమి ఉంటే రికార్డుల్లో 500 ఎకరాలుగా చూపించారని ఆరోపించారు. భూములు లేని వారికి, బినామీ రైతులకు పరిహారం చెల్లించారని, ఈ వ్యవహారంలో 50 శాతం వరకు కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మొత్తం రూ.60 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు.

ఈ అక్రమాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోకపోతే లోకాయుక్తను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్, కలెక్టర్ పాత్రపై విచారణ జరపాలని పట్నం నరేందర్‌రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు