పెట్టుబడులే లక్ష్యం
- 11 కొత్త పాలసీలతో వ్యూహాత్యక ప్రణాళికలు
- గ్లోబల్ సమ్మిట్ వేదికగా కీలక ప్రకటనలు
- సంప్రదాయ పరిశ్రమలు, ఏఐ,సెమీకండక్టర్ల తయారీపై ఫోకస్
- తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు కొత్త కార్యాచరణ
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : తెలంగాణ ఆర్థిక వ్యవస్థను(Telangana economy) బలో పేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీ అడ్డాగా నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా మార్చుకోబోతున్నది. ఏకంగా 11 నూతన పారిశ్రామిక, సాంకేతిక, విద్యా రంగాల పాలసీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది.
పెట్టుబడులను ఆహ్వానించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక వృద్ధిని అందించే రంగాలను ప్రోత్సహించాలన్నది ప్రభు త్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఇండస్ట్రియల్ పాలసీ 2.0, టెక్స్టైల్స్ అండ్ అపారెల్ పాల సీ 2.0, ఐసీటీ పాలసీ 2.0, డేటా సెంటర్స్ పాలసీ 2.0లను తీసుకురావడం ఈ సమ్మిట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఉన్న విధానాలను కొనసాగించడంతో పాటు మారుతున్న పారిశ్రామిక అవ సరాలకు అనుగుణంగా వాటిని మరింత విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
ముఖ్యంగా తయారీ రంగంలో పెట్టుబడులు పెరిగితే రాష్ట్రానికి మూలధనం సమకూరడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకా శాలు పెరుగుతాయి. వస్త్ర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తే పత్తి సాగు నుంచి దుస్తు ల తయారీ, ఎగుమతుల వరకు అనుబంధ రంగాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించాలని భావిస్తోంది.
ఈ రంగాల్లో పెట్టుబడులు రావడం అంత సులభం కాదు. భారీ మూలధనం, నిరంతర విద్యుత్ సరఫరా, నీటి లభ్యత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరం. వీటిని ప్రభుత్వం ఎంత సమర్థంగా అందించగలదన్న దానిపైనే ఈ విధానాల విజయం ఆధారపడి ఉంటుంది. డేటా సెంటర్ల విషయంలోనూ హైదరాబాద్‌కు ఉన్న ఐటీ అను కూల వాతావరణం, అంతర్జాతీయ కనెక్టివిటీ, సాంకేతిక నైపుణ్యాన్ని పెట్టుబడులుగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే డేటా సెంటర్లకు అవసరమైన విద్యు త్, నీరు, పర్యావరణ అనుమతుల నిర్వహణ కీలకం కానుంది.
జీసీసీలు, ఏవీజీసీతో కొత్త ఉపాధి మార్గాలు..
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాల సీ మరో కీలక విధానంగా మారనున్నది. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఎంఎన్సీ కంపెనీలు తమ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక సేవలు, డిజిటల్ కార్యకలాపాల కేం ద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఉన్నత విద్యావంతులకు నాణ్యమైన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
అదేవిధంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగానికి ప్రత్యేక పాలసీ తీసుకురావడం ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ రంగం కేవలం ఐటీ నిపుణులకే కాకుండా డిజైన్, యానిమేషన్, డిజిటల్ మీడియా, గేమ్ డెవలప్మెంట్ నైపుణ్యాలు ఉన్న యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీ ద్వారా రక్షణ, విమానయాన, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం జరగనుంది.
ఇప్పటికే హైదరాబాద్‌కు ఉన్న రక్షణ రంగ పరిశ్రమల అనుభవాన్ని మరింత విస్తరించుకునే అవకాశం ఉంది. ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ, లాజిస్టిక్స్ పాలసీల ద్వారా తయారీ, రవాణా, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థలకు ప్రోత్సాహం లభించవచ్చు. ఈ రంగాల్లో పెట్టుబడులు వస్తే పట్టణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఉపాధి మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీ మరో ఆసక్తికరమైన అంశంగా నిలవనున్నది.
విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహం అందించనుంది. దీనివల్ల ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు దేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్య పొందే వీలు కలుగుతుంది. అయితే విద్యా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ, పరిశోధన సదుపాయాలు, స్థానిక విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కూడా ఈ విధానంలో కీలకం కానున్నాయి.
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు కీలక పరీక్ష..
ప్రభుత్వం ప్రకటించనున్న 11 పాలసీలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విస్తృత అవకాశాలను తెరిచేలా కనిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సదస్సుల్లో పెట్టుబడుల ప్రకటనలు రావడం ఒక ఎత్తయితే, అవి వాస్తవ పరిశ్రమలుగా మారడం మరో ఎత్తు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి? ఎంత పెట్టుబడి వాస్తవంగా వచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? అన్న అంశాల ఆధారం గానే కొత్త విధానాల ఫలితాలను అంచనా వేయాల్సి ఉంటుంది.
ప్రత్యేకించి భూముల కేటాయింపు, అనుమతుల సరళీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను చూపించాల్సి ఉంటుంది. పెట్టుబడు లు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలకు ఈ 11 పాలసీలు పునాదిగా నిలవాలని భావిస్తోంది.
ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే పెట్టు బడుల ఆకర్షణతో పాటు పరిశ్రమల స్థాప న, ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలోనూ నిరంతర పురోగతి అవసరం. మొ త్తంగా గ్లోబల్ సమ్మిట్‌ను కేవలం పెట్టుబడిదారుల సమావేశంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక దిశను నిర్దేశించే వేదికగా మార్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 11 కొత్త పాలసీలతో శ్రీకారం చుట్టబోతున్నది.
కొత్త పాలసీలు...
ఇండస్ట్రియల్ పాలసీ 2.0
ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ
టెక్స్టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0
ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీ
లాజిస్టిక్స్ పాలసీ
ఐసీటీ పాలసీ 2.0
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ
డేటా సెంటర్స్ పాలసీ 2.0
ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీ
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ పాలసీ
ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీ