ఆ 320 కోట్లు ఏమైనట్టు!
- రైస్ మిల్లర్లలో తీవ్రమైన చర్చ
- 2022 ధాన్యం టెండర్లలో సంఘం ప్రతినిధి చేతివాటం
- క్వింటాలుకు రూ. 1875 వరకు టెండర్లు దాఖలు
- ఒక్కో క్వింటాలుకు రూ. 200 అదనంగా అసోసియేషన్ నేత వసూళ్లు
- 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్
- ధాన్యం అప్పగించని మిల్లర్ల నుంచి అప్పనంగా వసూళ్లపర్వం
- ప్రభుత్వ పెద్దల కోసమే అంటూ దాటవేత
- నిజంగా డబ్బులు ఎవరికి దక్కాయనేదిపైనే చర్చలు
హైదరాబాద్, నవంబర్ 2౮ (విజయక్రాంతి): వేలంలో టెండరు దక్కించుకున్నది(Won the tender) ఒకరైతే.. ఆ ధాన్యాన్ని అప్పగించాల్సింది మరొకరు. ఇలా ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకపోవడంతో.. ప్రభుత్వ నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇలా చెల్లించే మొత్తానికి అదనంగా రూ. 200 వసూలు చేశారు. ఈ అదనపు మొత్తం ఎందుకు, ఎక్కడికి వెళుతుందని ప్రశ్నిస్తే.. ప్రభుత్వ పెద్దల పేరు చెప్పిన సదరు రైస్ మిల్లర్ల సంఘం నాయకుడు అప్పటికి తప్పించుకున్నాడు.
అయితే ఇప్పుడు మరోసారి అప్పటి అదనపు వసూలు ఎక్కడికి వెళ్ళింది.. ఎవరెవకికి దక్కిందనే చర్చ రాష్ట్ర రైస్ మిల్లర్లలో తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఒక్కో క్వింటాలుకు రూ. 200 చొప్పున అదనంగా వసూలు చేసిన ఆమొత్తం ఎంతో తెలుసా.. సుమారు రూ. 320 కోట్లు. అంత భారీ మొత్తం కనుకనే.. అదే స్థాయిలో ఇప్పుడు మిల్లర్ల చర్చల్లో హాట్ టాపిక్‌గా మారింది.
34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం..
202 సీజన్‌కు సంబంధించి ధాన్యం టెండర్ల వ్యవహారం ఈ సంఘటనకు వేదికయ్యింది. మొత్తం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని టెండర్‌కు పిలిచారు. ఒకట్రెండు సార్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మిల్లర్లు ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. చివరికి క్వింటాలుకు రూ. 1875 నుంచి రూ. 1925 వరకు నిర్ణయించారు. దీనితో పలువురు వ్యాపారులు ఈ టెండర్లలో పాల్గొని 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో సుమారు 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు తీసుకున్నారు.
మిగతా మొత్తం ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న మిల్లర్ల నుంచి వ్యాపారులకు రావాల్సి ఉంది. అయితే అప్పటికే సదరు మిల్లర్లు ఈ ధాన్యాన్ని అమ్ముకోవడమో.. మిల్లింగు చేసి బియ్యాన్ని అమ్ముకోవడమో చేశారు. వారి వద్ద ధాన్యం లేకపోవడంతో.. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు మేరకు క్వింటాలుకు ఇంత అంటూ నిర్ణయించిన మేరకు డబ్బులు కట్టేందుకు ముందుకు వచ్చారు.
రూ. 320 కోట్లు ఎవరి జేబుల్లోకి..
ఇలా ఒక్కో క్వింటాలుకు రూ. 200 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నప్పుడే ప్రభుత్వ పెద్దలకు అని చెప్పడంతో ఎవరూ కిమ్మనకుండా చెల్లించారు. కానీ ఇప్పుడు తాజాగా.. ఈ అంశం మరోసారి మిల్లర్లలో చర్చనీయాంశమవుతోంది. కారణం.. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు, అవకతవకలు, అవినీతికి పాల్పడిన మిల్లర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే అప్పట్లో రూ. 200 చొప్పున అదనంగా సేకరించిన మిల్లర్ల సంఘం నేతకు సంబంధించిన మిల్లులపై మాత్రం ఒక్క దాడి చేయలేదు.
తనిఖీలు లోతుగా చేయలేదు. పైపెచ్చు క్లీన్ చిట్ ఇప్పించుకున్నారనికూడా చర్చించుకుంటున్నారు. అదీగాక.. ఎలాంటి బకాయిలు లేవనేలా ప్రభుత్వానికి ఉన్న పాత బకాయిలను సైతం సదరు మిల్లింగ్ నేత చెల్లించినట్టుగా సమాచారం. దీనితో అప్పట్లో వసూలు చేసిన సుమారు రూ. 320 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి. ఎవరికి లాభం కలిగిందనే కోణంలో మిల్లర్లు చర్చించుకుంటుండటం గమనార్హం.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 320 కోట్ల మొత్తం ఇప్పుడు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయనే అంశం రైస్ మిల్లర్లలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఒకపక్క ప్రభుత్వం మిల్లర్లపై ఉక్కుపాదం మోపుతూ..గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకల చిట్టాను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేస్తూ.. అక్రమార్కులపై కేసులు పెడుతూ..
అరెస్టులుకూడా చేస్తున్నారు. అయితే సదరు మిల్లింగ్ నేత మాత్రం ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి వసూలు చేసిన సుమారు రూ. 320 కోట్లు నిజంగా ప్రభుత్వ పెద్దలకు ఇచ్చాడా.. లేక తన జేబులోనే వేసుకున్నాడా అనే అనుమానాలు మిల్లర్లలో వ్యక్తమవుతున్నాయి. తన బకాయిలను చెల్లించేందుకు గతంలో వసూలు చేసిన ఈ మొత్తాన్ని వాడుకున్నాడని అనుమానిస్తున్నారు. తన జేబులు నింపుకునేందుకు ప్రభుత్వ పెద్దల పేర్లు వాడుకున్నాడని మిల్లర్లు చర్చించుకుంటున్నారు. నిజంగా ప్రభుత్వ పెద్దలు చెప్పారా.. వసూలు చేసిన మొత్తం వారికి చేరాయా.. లేక మధ్యలో సదరు మిల్లింగు నేతనే మెక్కారా అనే అనుమానాలు మాత్రం మిల్లర్లను వెంటాడుతున్నాయి.
ప్రభుత్వ పెద్దల పేరు.. అదనంగా రూ. 200 వసూలు..
ఇదిలా ఉండగా.. టెండర్లలో కొనుగోలు చేసిన ధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించినమేరకు డబ్బులు చెల్లించేందుకు ముందుకు వచ్చిన మిల్లర్ల నుంచి క్వింటాలుకు రూ. 200 వరకు అదనంగా వసూలు చేశారు. ఈ రూ. 200 మొత్తాన్ని మిల్లర్ల అసోయేషన్‌కు చెందిన ఒక ముఖ్యమైన బడా మిల్లరు వసూలు చేశారు. ఈ అదనపు మొత్తాన్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందించాలని అందుకే ఈ రూ. 200 చొప్పున వసూలు చేస్తున్నట్టుగా సదరు నేత చెప్పడంతో.. మిల్లర్లు ఎవరూ ఒక్కమాటకూడా మాట్లాడకుండా ఒక్కో క్వింటాలుకు రూ. 200 చొప్పున అదనంగా చెల్లించారు.