డీలిమిటేషన్‌తో సామాజిక న్యాయంపై దాడి
- ‘850’ ముసుగులో ప్రజాస్వామ్యాన్ని కబళించనివ్వం
- మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు ఉపకోటా కల్పించాలి
- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : లోక్‌సభ స్థానాలను(Lok Sabha constituencies) 850కి పెంచే ప్రతిపాదనను అడ్డుపెట్టుకొని దేశ రాజకీయ పటాన్ని అనుకూలంగా మార్చే ప్రయత్నాలను ప్రతిఘటిస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Telangana Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. డీలిమిటేషన్‌తో సామాజిక న్యాయంపై దాడి చేసే కుట్రలను అడ్డుకుంటామని శనివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. డీలిమిటేషన్ ప్రక్రియ కేవలం సీట్ల సంఖ్యకు చెందినదే కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిథ్యంతో కూడుకున్నదని పేర్కొన్నారు.
850 సంఖ్యను గుర్తుంచుకోవాలన్న రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోలేమని, ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల సరిహద్దులు ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రాతిపదికన మారుస్తున్నారన్నదే కీలకమని తెలిపారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్‌ను ఆయుధంగా మార్చితే అది ప్రజాస్వామ్య పునర్వ్యవస్థీకరణ కాదని, ప్రజల తీర్పును ముందుగానే నియంత్రించే ప్రయత్నమవుతుందని పేర్కొన్నారు.
2027 జనగణన, కులగణన ద్వారా వెలుగులోకి వచ్చే సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా స్థానాలను కేటాయించి, 2051 వరకు వాటినే కొనసాగించాలనుకోవడం అన్యాయమని తెలిపారు. పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టి అమలును వాయిదా వేయడం సరికాదని సూచించారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా కల్పించాలన్నారు.