డ్యాన్స్‌తో ఫేమ్.. ఇప్పుడు విలన్‌గా ఎంట్రీ.. ఎవరీ రాఘవ్ జుయాల్?
Raghav Juyal: డ్యాన్సర్ నుంచి ‘ది ప్యారడైజ్’ విలన్ వరకు.. ఆయన జర్నీ ఇదే!
స్లో-మోషన్ డ్యాన్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో రాఘవ్ జుయాల్ ఒకరు. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. టీవీ షోలు, హోస్టింగ్, సినిమాలతో తన పరిధిని క్రమంగా విస్తరించారు. ఇప్పుడు తెలుగు సినిమాతో మరో కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’లో రాఘవ్ జుయాల్ కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన విక్రమ్ మాలిక్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం ఆయనకు టాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం.
డ్యాన్స్‌తో మొదలైన గుర్తింపు
రాఘవ్ జుయాల్‌కు మొదటగా డ్యాన్స్ ద్వారానే గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఆయన చేసే స్లో-మోషన్ డ్యాన్స్ మూవ్స్ ప్రత్యేకంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు ‘స్లో మోషన్’ స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. తర్వాత టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ హోస్టింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోనూ తనదైన శైలిని చూపించారు.
సినిమాల్లోనూ అడుగులు
డ్యాన్స్ తర్వాత నటన వైపు అడుగులు వేసిన రాఘవ్.. హిందీలో ‘ABCD 2’, ‘Street Dancer 3D’, ‘Kill’ వంటి సినిమాల్లో కనిపించారు. ముఖ్యంగా Killలోని పాత్ర తర్వాత నటుడిగా ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది.
‘ది ప్యారడైజ్’లో కొత్త అవతారం
ఇప్పటివరకు డ్యాన్సర్‌గా, నటుడిగా ప్రేక్షకులకు పరిచయమైన రాఘవ్.. ‘ది ప్యారడైజ్’లో మాత్రం పూర్తిగా భిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నారు. విక్రమ్ మాలిక్ పాత్రలో ఆయన లుక్‌ను మేకర్స్ ఇప్పటికే పరిచయం చేశారు. నాని పాత్రతో ఆయనకు ఎదురుపడే కీలకమైన ప్రతినాయక పాత్ర ఇది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ పాత్ర కోసం సరైన నటుడి కోసం సుమారు ఎనిమిది నెలలు వెతికినట్లు ఇటీవల వెల్లడించారు. రాఘవ్‌ను కలిసిన తర్వాత పాత్రను ఆయన సహజమైన ఎనర్జీకి తగ్గట్టుగా మార్చినట్లు తెలిపారు.