పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ..!

26-11-2026 | 05:40am

సహజమైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల్లో(South Indian audiences) ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్(Actress Nithya Menen) తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో(film circles) హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో(Podcast) పాల్గొన్న నిత్యా.. తన గత ప్రేమ బంధాల గురించి కూడా మనసు విప్పి మాట్లాడింది. ముఖ్యంగా తనకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందని ఆమె స్పష్టం చేసింది. “నేను పెళ్లి చేసుకోనని ఎప్పుడూ చెప్పలేదు. నాకూ పెళ్లి చేసుకోవాలనుంది. అయితే నేను వెతుకుతున్నది కేవలం పెళ్లి కాదు.. ఒక మంచి బంధం. నన్ను అర్థం చేసుకునే, నా వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి కావాలి.

అలాంటి వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటా. అలాంటి బంధం లేనప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తా. కొన్ని సంబంధాల్లో ఉన్నప్పుడు నా వ్యక్తిత్వం కుదించుకుపోతున్నట్లు అనిపించేది. నేను ఎదగలేకపోతున్నానని, స్వేచ్ఛగా ఉండలేకపోతున్నానని అనిపించేది. అలాంటి బంధాల నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆ నిర్ణయం తీసుకున్నా. ఆ బంధాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న అనుభూతి కలిగింది. నా ముందు కొత్త ప్రపంచం తెరుచుకున్నట్లు అనిపించింది.

నేను పెళ్లి గురించి మాట్లాడినప్పుడల్లా పెళ్లికి వ్యతిరేకమని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నా జీవితంలోకి వచ్చే వ్యక్తి నన్ను ఎదగనివ్వాలి. నా స్వేచ్ఛను గౌరవించాలి. ఒకరినొకరు కట్టడి చేసుకోకుండా, పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అలాంటి బంధం ఏర్పడినప్పుడే పెళ్లికి అర్థం ఉంటుంది. కేవలం సమాజం కోసం లేదా ఇతరుల ఒత్తిడితో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అంటూ తన మనసులోని మాటను వెల్లడించింది నిత్యా. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. పెళ్లి విషయంలో ఆమె తీసుకున్న స్పష్టమైన వైఖరిని పలువురు అభినందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు