అలియాస్ రుక్మిణి నా కెరీర్‌లో బెస్ట్ సినిమా
నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి(Alias Rukmini)’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నాని తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. ‘ఈ డిసెంబర్ 4న మీ ఇంటికి తీసుకెళ్లేలా ఒక మంచి సినిమాను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా. థియేటర్లకు వస్తే.. మిమ్మల్ని బాగా చూసుకుంటాడు కృష్ణ’ అని ట్వీట్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నితిన్ మాట్లాడుతూ.. “అలియాస్ రుక్మిణి’ నా కెరీర్‌లో చాలా స్పెషల్ సినిమా. ఫస్ట్ టైమ్ ఎలాంటి లెక్కలు వేసుకోకుండా, కథ నచ్చి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. ఒక బిడ్డను తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, ఈ సినిమాను దీప్తి అంత జాగ్రత్తగా చూసుకున్నారు. తను మా సినిమాకు శివగామి (నవ్వుతూ). ఈ సినిమాకు మరో సీక్రెట్ సూపర్ స్టార్ నాని. తను లేనిదే ఈ సినిమా లేదు. కమర్షియల్ సినిమాలు చేసే నాతో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చేస్తానని నమ్మారు” అన్నారు.
‘ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. అందరూ ఇష్టపడతారని నమ్ముతున్నాన’ని హీరోయిన్ ఆఫియా సయ్యద్ తెలిపింది. డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ.. “డిసెంబర్ 4న అందరూ ఒక అందమైన సినిమాను చూస్తారు. కచ్చితంగా ప్రేమిస్తారు. చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది” అని చెప్పారు. నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ.. “నితిన్ ఫ్యాన్స్‌లా థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత కృష్ణ ఫ్యాన్స్‌లా తిరిగి వెళ్తారు. అంత అద్భుతంగా నితిన్ నటించారు” అన్నారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.