ఆస్కార్ బరిలో గోంధల్
భారతీయ సంస్కృతి, సామాజిక అంశాల నేపథ్యంతో తెరకెక్కిన మరాఠీ చిత్రం
‘ధురంధర్’, ‘హనుమాన్ అంశ్’ కన్నా జ్యూరీ సభ్యులను ఆకట్టుకున్న సినిమా
ప్రతిష్టాత్మక ఆస్కార్(Oscar)-2027 అవార్డుల పోటీలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా మరాఠీ థ్రిల్లర్ మూవీ ‘గోంధల్(Gondhal)’ ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Film Federation of India) (ఎఫ్‌ఎఫ్‌ఐ) నేతృత్వంలోని జ్యూరీ కమిటీ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. త్వరలో జరగనున్న 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) వేడుకలో ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్(Best International Feature Film)’ విభాగంలో ఈ చిత్రం ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఆస్కార్ ఎంట్రీ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 33 సినిమాలు పోటీపడ్డాయి.
ఇందులో హిందీ నుంచి అత్యధికంగా 14 చిత్రాలు బరిలో నిలువగా.. మరాఠీ, తెలుగు, గుజరాతీ భాషల నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. తమిళం నుంచి మూడు, మలయాళం, నాగమీస్ భాషల నుంచి ఒకటి చొప్పున సినిమాలు పోటీకి వచ్చాయి. మరో మూకీ సినిమా కూడా ఇందులో ఉంది. ఈ సినిమాల ఎంపిక కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రత్యేక జ్యూరీని ఏర్పాటుచేసింది. తెలుగు నుంచి ‘సింగ్ గీతం’, ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘ఇగ్వా’ (రిలీజ్ కాలేదు) సినిమాలు కమిటీ స్క్రీనింగ్‌కు వెళ్లాయి.
హిందీ నుంచి ‘120 బహదూర్’, ‘బోర్డర్2’, ‘ధురంధర్’, ‘ధురంధర్2’, ‘ఇక్కీస్’, ‘హనుమాన్ అంశ్’ తదితర సినిమాలను జ్యూరీ వీక్షించింది. ఇలా ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచిన ‘ధురంధర్’, ‘హనుమాన్ అంశ్’ వంటి జనాదరణ పొందిన చిత్రాలను వెనక్కి నెట్టి ‘గోంధల్’ ఈ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. భారతీయ సంస్కృతి, సామాజిక అంశాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం జ్యూరీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం.
భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా నిలిచిన ఈ చిత్రం ఆస్కార్ వేదికపై దేశ ఖ్యాతిని చాటుతుందని చిత్ర పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ‘ధురంధర్’, ‘హనుమాన్ అంశ్’ చిత్రాల కంటే భిన్నమైన కథాంశంతో, అద్భుతమైన నిర్మాణ విలువల కారణంగానే ఈ చిత్రానికి జ్యూరీ మొదటి ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎంపికపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది.