నాలుగు కిలోల గజ్జెలతో లావణీకి అభినయం!

19-11-2026 | 05:25am

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్(Bollywood actress Shraddha Kapoor) తన తాజా చిత్రం ‘ఈఠా’ కోసం లావణీ నృత్యాన్ని ప్రత్యేకంగా నేర్చుకుంది. మహారాష్ట్ర సంప్రదాయ జానపద కళారూపమైన లావణీని వెండితెరపై సహజంగా ఆవిష్కరించేందుకు ఎంతో కష్టపడినట్లు ఆమె వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రముఖ లావణీ, తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణంగావ్‌కర్ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన పాత్రలో శ్రద్ధా కనిపించనుంది. ‘ఈఠా’ చిత్రంలోని తొలి పాట ‘జీ జీ రే జీ’ విడుదల సందర్భంగా శ్రద్ధా తన అనుభవాలను పంచుకుంది.

“లావణీ ఎంతో అందమైన నృత్యరీతి. అదే సమయంలో చాలా కష్టమైనది కూడా. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు లావణీ గురించి అస్సలు తెలియదు. అందుకే ఎన్నో వర్క్‌షాప్‌లకు హాజరయ్యా. ప్రముఖ లావణీ కళాకారిణి శకుంతలాజీ సహా పలువురు కళాకారులను కలిశా. ఆమె నుంచి నేను నేర్చుకున్న విషయాలు అద్భుతమైనవి. కాళ్లకు గజ్జెలు కట్టుకుని సాధన చేస్తే నృత్యం చేయడం అలవాటవుతుంది. కానీ ముఖంలో పలికించాల్సిన భావాలను మాత్రం మనం అర్థం చేసుకోవాలి అని ఆమె చెప్పారు. తమాషా కళాకారుల జీవితాలు ఎన్నో కష్టాలతో నిండి ఉంటాయి.

అందుకే వారి నృత్యాల్లో బాధతో పాటు ఆనందం కూడా కనిపిస్తుంది. ఒక్కో కాలికి నాలుగు కిలోల బరువున్న గజ్జెలు కట్టుకుని నృత్యం చేయడం అంత సులభం కాదు. ఆ ఎనిమిది కిలోల గజ్జెలను మన శరీరంలో ఒక భాగంగా భావించి కదలడం అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ కళారూపాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం ఇచ్చారు. ప్రతి పాట చిత్రీకరణకు ముందు రెండు నుంచి మూడు వారాల పాటు రిహార్సల్స్ చేసేవాళ్లం. ప్రతి కదలికను పక్కాగా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. లావణీని అర్థం చేసుకోవడానికి, సాధన చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇది కేవలం విఠాబాయి కథ మాత్రమే కాదు. వేలాది మంది తమాషా కళాకారుల కథ.

వారి జీవితాల్లోని కష్టాలు, పోరాటాలు, కళ పట్ల వారికున్న అంకితభావం ఈ సినిమాలో కనిపిస్తాయి. నాకు 80 లేదా 90 ఏళ్లు వచ్చినప్పుడు, ఒక మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయలేకపోయాననే బాధ ఉండకూడదు. అందుకే మంచి కథల కోసం ఎదురుచూస్తా. అద్భుతమైన కథల్లో భాగం కావాలనుకుంటా” అని చెప్పింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దినేశ్ విజన్‌కు చెందిన మ్యాడాక్ ఫిలమ్స్ నిర్మిస్తోంది. ఇందులో రణ్‌దీప్ హుడా, నానా పటేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజయ్ సంగీతం అందించారు. ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్లలో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు