మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
మల్లాపూర్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగేందుకు డబ్బులు లేక మనస్తాపంతో ఆత్మహత్య (Suicide) చేసుకున్న విషాద ఘటన మల్లాపూర్ మండలం కొత్తదామరాజుపల్లి గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డల పెద్ద లింబాద్రి (62) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన, మద్యం కోసం డబ్బులు కావాలని తరచూ ఇంట్లో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం భార్య నర్సుతో కలిసి తోటకు వెళ్లిన లింబాద్రి మద్యం కోసం డబ్బులు అడగగా, ఆమె వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఎవరికీ చెప్పకుండా తోట నుంచి వెళ్లిపోయిన ఆయన రాత్రి ఇంటికి తిరిగి రాలేదు.శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో గ్రామంలోని కిందవాడలో ఉన్న మరో ఇంటి రేకుల షెడ్డు దూలానికి లుంగీతో ఉరి వేసుకుని వేలాడుతూ లింబాద్రిని స్థానికులు గుర్తించారు.
కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని ఉరి విప్పి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.మద్యానికి డబ్బులు లేక మనస్తాపంతోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుమార్తె బండి అంజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.