అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిషత్ కార్యాలయ(Chegunta Mandal Parishad Office) సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సాధారణ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy) ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మూడు నెలలకోసారి జరిగే ఇంతటి కీలక సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
విద్యా వ్యవస్థపై సమీక్షిస్తూ ఇన్‌చార్జ్ ఎంఈవో నీరజ(In-charge MEO Neeraj)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనపై నమ్మకం లేకే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడం లేదని, విద్యార్థుల నమోదు పెరిగేలా విద్యా ప్రమాణాలను ఎందుకు మెరుగుపరచడం లేదని ప్రశ్నించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పౌష్టికాహార పంపిణీపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి (District Welfare Officer) హేమ భార్గవితో కలిసి ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి, ఎస్సై చైతన్యకుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు.పాల్గొన్నారు.