తెలంగాణ చరిత్రపై ఓపెన్‌ డిబేట్‌

16-09-2026 | 05:29pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 16 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University) దక్షిణ ప్రాంగణం భిక్కనూర్‌లో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘సెప్టెంబర్‌ 17.. తెలంగాణపై ఒక చారిత్రక దృక్పథం’ అనే అంశంపై ఓపెన్‌ డిబేట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో వక్తలు దేమే రాజారెడ్డి, మద్ది చంద్రకాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ గౌడ్‌, డాక్టర్‌ ఎం. సుధాకర్‌ పాల్గొని సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యత, నిజాం పాలన, రజాకార్ల పాత్ర, తెలంగాణ సాయుధ పోరాటం తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

దేమే రాజారెడ్డి మాట్లాడుతూ నిజాం జీవనశైలి, రజాకార్ల అరాచకాల గురించి వివరించారు. నిజాం రజాకార్లను అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోగలిగేవాడని, అయితే అలా జరగలేదని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో సంబంధాలు, స్టాండ్‌స్టిల్‌ ఒప్పందం తదితర అంశాలను ప్రస్తావిస్తూ హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక పరిణామాలను వివరించారు.

డాక్టర్‌ ఎం. సుధాకర్‌ మాట్లాడుతూ చరిత్ర అంటే కేవలం తేదీలు కాదని, ప్రజలు ఎలా గుర్తుంచుకుంటారో కూడా చరిత్రలో భాగమేనన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రైతుల పాత్రను వివరించారు. యూనియన్‌ ఆర్మీ చర్యలపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సెప్టెంబర్‌ 17ను విద్రోహ దినంగా భావించాలని పేర్కొన్నారు.

ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ చరిత్రలో తెలంగాణ విమోచన దినానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. డాక్టర్‌ పోతన్న మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటకలో సెప్టెంబర్‌ 17ను వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారని, తెలంగాణలోనూ ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు