అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా

06-10-2026 | 12:11am

నాలుగు ట్రాక్టర్లు పట్టివేత.. 

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ ఎస్సై ఎ. లక్ష్మారెడ్డి(SI Lakshma Reddy) సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం రూరల్ మండల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి వాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను కరీంనగర్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు.

దీంతో పోలీసులు అప్రమత్తమై ముగ్దుంపూర్ వద్ద ఒక ట్రాక్టర్, దుర్షేడు వద్ద రెండు ట్రాక్టర్లు, లారీ అసోసియేషన్ సమీపంలో మరో ట్రాక్టర్‌ను పట్టుకున్నారు.పట్టుబడిన ట్రాక్టర్లకు సంబంధించి గొబ్బల విశ్వనాథరెడ్డి, గొబ్బల విలాసరెడ్డి, దాసరి సంపత్, వీర్ల సంపత్, సప్పట్ల సంపత్, పున్న గంగరాజు, దాసరి శ్రీనివాస్ తదితరులు యజమానులు, డ్రైవర్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.నాలుగు ట్రాక్టర్లను పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్న పోలీసులు, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసులు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు