సమయానికి రారు...

19-09-2026 | 03:18pm
  1. అందుబాటులో ఉండరు...
  2. తెరుచుకోని కార్యాలయం ఫోటో తీస్తే బెదిరింపులు...
  3. మండల పశు వైద్యాధికారి తీరుపై రైతుల ఆగ్రహం

కోటపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోనీ మండల పశు వైద్యాధికారి కార్యాలయం (Veterinary Officer's Office) ఎప్పుడు తెరుస్తారో.., ఎప్పుడు మూస్తారో ఎవరికి తెలియదు. ఆ కార్యాలయానికి చుట్టు పక్కల కార్యాలయాల సిబ్బంది బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. పశులకు వైద్య సలహాల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన పశు పోషకులకు నిరాశే ఎదురవుతుంది...

వైద్యాధికారి కోసం ఏ సమయంలో రైతులు వస్తే పక్క కార్యాలయ సిబ్బంది మేడం ఇప్పుడే వెళ్లిందని సమాధానం ఇవ్వడమే కాకుండా పలానా రైతు, ఫలానా నాయకుడు, ఫలానా విలేఖరి ఇక్కడికి వచ్చారంటూ స్థానికంగా ఉండని ఆ అధికారికి సమాచారం అందిస్తుంటారు. సమాచారం అందుకున్న అధికారి ఆగ మేఘాల మీద వచ్చి చేరుకోవడం ఇక్కడ సహజంగా మారిపోయింది. ఈ కార్యరానికి అధికారి ఏ రోజు సమయానికి వచ్చిన దాఖలాలు లేవని రైతులు బాహాటంగా వాపోతున్నారు.

తెరుచుకోని కార్యాలయం ఫోటో తీస్తే బెదిరింపులు...

పశువులు అనారోగ్యానికి గురై వైద్యం కోసం ఆశ్రయిస్తున్న పాడి రైతులు మండల పశు వైద్యాధికారి వ్యవహరిస్తున్న తీరుపై విలేకరులకు సమాచారం అందిస్తే కథ వేరేలా ఉంటుంది... విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, సమయపాలన పాటించడం లేదని రైతులు ఆరోపిస్తుండగా.. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో మర్యాదగా వ్యవహరించకుండా దురుసుగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, అధికారి విధులపై, మండల పశు సమాచారంపై ఎవరైనా మాట్లాడితే పోలీసులకు ఫోన్లు చేసి బెదిరింపులు, విలేకరులమని చెబితే నేను లేని సమయంలో మీరు ఎందుకు వచ్చారు, నా అనుమతి లేకుండా కార్యాలయం ఫోటో ఎందుకు తీశారు, నీ ఎడిటర్ ఫోన్ నెంబర్ ఇవ్వు, నీ ఐడి కార్డ్ చూపించు, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తారా అంటూ ఎదురుదాడికి దిగి విలేకరులను సైతం బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ అధికారి తీరు అందర్నీ విశ్మాయానికి గురిచేస్తుంది.

శనివారం ఉదయం దాదాపు 11 గంటల వరకు పశు వైద్య అధికారి కార్యాలయం తలుపులు తెరిచి ఉండకపోవడంతో కొందరు పశు పోషకులు విసిగి విలేకరులకు సమాచారం అందిస్తే అక్కడకు చేరుకుని తలుపులు వేసి ఉన్న కార్యాలయం ఫోటో తీయగానే బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న పక్క కార్యాలయ సిబ్బంది సదరు పశు వైద్యాధికారికి సమాచారం అందించారు.

“మండలంలో నేను ఒక్క అధికారిని మాత్రమే ఉన్నాను, ఎవరు లేరు... విధులు ఎలా నిర్వహించాలో మీరు మాకు నేర్పిస్తారా?”, మీరు విలేకరులు అయితే మీ ఎడిటర్కు కంప్లైంట్ చేస్తా, మూసి ఉన్న కార్యాలయం ఫోటో ఎలా తీస్తారు, మండలంలో మీరు తప్ప ఏ విలేకరి ఇక్కడికి రాలేదు, రారు..., విజయక్రాంతి రిపోర్టర్ కు ఈ సమస్య ఒకటే కనిపిస్తుందా..! అంటూ అధికారి దురుసుగా మాట్లాడడం అధికారి పనితీరును తెలియజేస్తుంది. రైతులను అయితే ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

అది ప్రభుత్వ కార్యాలయం, రైతులు, నాయకులు, విలేకరులు, ఉన్నతాధికారులు, సామాన్యులు ఎవరు వచ్చినా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత గల అధికారి, అక్కడికి చేరిన వారిపై విరుచుకుపడడమే కాకుండా పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరిస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వ అధికారి సేవలందించాల్సింది పోయి బెదిరింపు ధోరణి అవలంబించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రైతులు, పశువుల సంక్షేమం కోసం పని చేయాల్సిన శాఖలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై పాడి రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారి పనితీరు, సమయపాలన, రైతులతో వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు