దళితుడి భూమిపై కబ్జాదారుల కన్ను

02-11-2026 | 07:33pm

ప్రాణహాని ఉందని కలెక్టర్‌ ను వేడుకున్న వృద్ధ దంపతులు 

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : దళితుడి భూమిపై కబ్జాదారులు కన్ను వేయడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమ వారం కలెక్టర్ కుమార్ దీపక్ ను(Collector Kumar Deepak) వృద్ధ దంపతులు వేడుకున్నారు. వివరాలలోకి వెళితే... ప్రభుత్వం నిరుపేద కోటాలో మంజూరు చేసిన సీలింగ్ భూమిని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని, అక్రమ నిర్మాణాలు చేపడుతూ తనను బెదిరిస్తున్నారని  మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దళిత వృద్ధ దంపతులు చెగ్యాం బొందయ్య, దేవమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా 

బాధితులు విలేకరులతో బాధను వెళ్లగక్కారు.. మందమర్రి మండలంలోని తిమ్మాపూర్ శివారులోని సర్వే నంబర్ 341లో తమకు ప్రభుత్వం ఫైల్ నెం. 1301/75 ద్వారా 5 ఎకరాల సీలింగ్ భూమిని కేటాయించి పట్టా అందజేసిందనీ, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 340 పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో సర్వే నంబర్ 341లోని తన భూమిని అక్రమంగా ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు, భూమిలోని బోరును కూడా ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని వాపోయారు.

ఈ ఆక్రమణలను అడ్డుకోబోతే తనపై, కుటుంబ సభ్యులపై దాడికి దిగుతూ ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అడ్డం వస్తే చంపేస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వృద్ధ దంపతులు  కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై గతంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌తో పాటు క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్టోబర్ 12న కూడా మరోసారి దౌర్జన్యంగా సిమెంట్ దిమ్మలతో గోడ నిర్మించారని, ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా ఇళ్లు కట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్న కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ భూమిని రక్షించి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ వినతిపత్రం ప్రతులను తహసీల్దార్, ఎస్హెచ్ఓ, మున్సిపల్ కమిషనర్‌లకు కూడా అందజేసినట్లు వారు వెల్లడించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు