పశువైద్యాధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా అధికారి
- మమ అనిపిస్తారో.. చర్యలు తీసుకుంటారో..!
కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండల కేంద్రంలోనీ మండల పశు వైద్యాధికారి కార్యాలయాన్ని సోమ వారం జిల్లా పశుసంవర్ధక, పశు సంక్షేమ శాఖ అధికారి యాకుబ్ రెడ్డి సందర్శించి మండల పశు వైద్యాధికారి అరుణ పని తీరుపై విచారణ జరిపారు. ఈ నెల 19న 'విజయక్రాంతి'లో "సమయానికి రారు... అందుబాటులో ఉండరు... తెరుచుకోని కార్యాలయం.. ఫోటో తీస్తే బెదిరింపులు..." పేరిట వచ్చిన కథనానికి జిల్లా పశు వైద్యాధికారి స్పందించారు. కార్యాలయానికి సదరు అధికారి ఏ సమయానికి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, రైతులకు అందిస్తున్న సేవలపై విచారణ జరిపారు. సదరు అధికారి ప్రతిరోజు ఏఏ గ్రామాన్ని సందర్శించి పశు పోషకులకు సలహాలు సూచనలు ఇస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మండలంలో వ్యాక్సినేషన్ పనితీరుపై సైతం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మమ అనిపిస్తారో.. చర్యలు తీసుకుంటారో..!
ప్రభుత్వ అధికారి పశు పోషకులకు, రైతుల(Farmers)కు అందుబాటులో ఉండి సేవలందించాల్సింది పోయి, స్థానికంగా ఉండకుండా, ప్రశ్నించిన వారిపై బెదిరింపు ధోరణి అవలంబించడంపై ఫీల్డ్ లో తిరిగి పరిశీలించాల్సిన అధికారులు కార్యాలయానికి ఇలా వచ్చి అలా వెళ్లారని పలువురు రైతులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. రైతులు, పశువుల సంక్షేమం కోసం పని చేయాల్సిన శాఖలో ఇలా పురుషుగా వ్యవహరిస్తున్న అధికారిపై పలువురు పశుపోషకులు, పాడి రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా జిల్లా అధికారి విచారణ మమ అన్నట్లుగా మండల కార్యాలయానికి వచ్చి వెళ్లారు తప్ప తను అందిస్తున్న సేవలపై విచారణ జరుపకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారి పనితీరు, సమయపాలన, రైతులతో వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు తేల్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణకు హాజరైన ఉన్నతాధికారులు మండల పశువైద్యాధికారిపై చర్యలు తీసుకుంటారా.., లేక మమ అనిపిస్తారో వేచి చూడాల్సిందే...