5 September, 2026 | 11:14 PM

రాజకీయాల్లోకి వచ్చింది దోపిడీ చేయడానికి కాదు

05-09-2026 | 09:28pm

* పదేళ్లు అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదు

* కాంగ్రెస్ ప్రజా పాలన 1000 రోజుల విజయోత్సవ ర్యాలీ

* భూత్పూర్ లో కాంగ్రెస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ 

భూత్పూర్: మేము రాజకీయాల్లోకి వచ్చింది మీలాగా దోపిడీ చేయడానికి కాదని, ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయడానికి అని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudhan Reddy) మండిపడ్డారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామం నుంచి భూత్పూర్ పట్టణం కేంద్రం వరకు ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథంలో 1000 రోజుల ప్రజా పాలన ప్రజా సంక్షేమ విజయోత్సవాలను పురస్కరించుకొని భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు.

ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్య, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధిని పూర్తిగా విమర్శించారని ఆయన తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నామన్నారు. పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను మేము వెయ్యి రోజుల్లోనే చేసి చూపించామన్నారు. దాన్ని బీఆర్ఎస్ నాయకులు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విద్వాంసాన్ని సరిదిద్దుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇల్లు ఇచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదని స్వయంగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, రెండోసారి 50వేల మెజార్టీతో గెలుపొందుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే సి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు