ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఇప్పటి నుంచే కార్యాచరణ

10-10-2026 | 07:18pm

హైదరాబాద్‌: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. తక్కువ వర్షపాతం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కరవు నివారణ చర్యలపై అధికారులతో సమీక్షకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ, నీటి వనరులు, విద్యుత్, వ్యవసాయ సంబంధిత సవాళ్లను ముందుగానే అంచనా వేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. రాబోయే జూన్ వరకు తాగునీటి సరఫరా, సాగునీటి నిర్వహణ, పంటల రక్షణ, విద్యుత్ వినియోగం వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

నీటి నిర్వహణకు ప్రాధాన్యం

నీటి కొరత తలెత్తకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని. ప్రతి చుక్క నీటిని సంరక్షించేలా చర్యలు చేపట్టడంతో పాటు వర్షపు నీటి నిల్వ, చెరువుల పరిరక్షణ, లీకేజీల నియంత్రణ, నీటి పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటికి ప్రాధాన్యమిస్తూ సాగునీటిని అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని తెలిపారు.

విద్యుత్ పొదుపే కీలకం

ఎండల తీవ్రత పెరిగి విద్యుత్ డిమాండ్ అధికమైతే సరఫరాపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు నిధులు ఉన్నా, మార్కెట్‌లో తగినంత విద్యుత్ లభ్యత లేకపోతే సమస్య మరింత క్లిష్టమవుతుంది. అందువల్ల విద్యుత్ పొదుపుపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలి. అత్యవసరం కాని విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైన మేరకు వాయిదా వేయడం, అనవసర వినియోగాన్ని తగ్గించడం, వ్యవసాయం, తాగునీటి సరఫరా, ఆసుపత్రులు వంటి కీలక అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రణాళిక రూపొందించడం అవసరం.

వ్యవసాయానికి ముందస్తు భరోసా

వాతావరణ అంచనాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక, తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన, సూక్ష్మ సేద్యం, నేలలో తేమ సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు వాతావరణ సమాచారం, సాగు సలహాలు, నీటి లభ్యతపై ముందస్తు సమాచారం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలి.

ప్రజల భాగస్వామ్యంతో అవగాహన

ఎల్‌నినో ప్రభావం, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సినిమా, టెలివిజన్, పత్రికలు, డిజిటల్ మీడియా, కళాజాతాలు, స్థానిక ప్రజా సంఘాల ద్వారా ప్రజలకు సందేశాన్ని చేరవేయాలి. ప్రతి గ్రామంలో నీరు, విద్యుత్ వినియోగంపై స్థానిక కార్యాచరణ రూపొందించి ప్రజలను భాగస్వాములను చేయాలి.

సంక్షోభం రాకముందే సన్నద్ధత

కోవిడ్ సమయంలో అనుసరించిన సమన్వయ విధానాల నుంచి పాఠాలు తీసుకుంటూ, ఎల్‌నినో సంబంధిత సంభావ్య సవాళ్ల కోసం శాఖల మధ్య సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, అత్యవసర స్పందన వ్యవస్థను సిద్ధం చేయాలి. నీటి నిల్వలు, విద్యుత్ డిమాండ్, పంటల పరిస్థితులపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి అవసరమైనప్పుడు ప్రణాళికను సవరించాలి. ఎల్‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనేది వాతావరణ పరిస్థితులు, ప్రాంతీయ మార్పులపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ ముందస్తు ప్రణాళిక, వనరుల పొదుపు, ప్రజల భాగస్వామ్యంతో సంభావ్య నష్టాలను తగ్గించే అవకాశం ఉంది. సంక్షోభం వచ్చిన తర్వాత స్పందించడం కంటే, అది తలెత్తకుండా ముందుగానే సన్నద్ధం కావడమే కీలకం.

మరిన్ని వార్తలు