సింగరేణి అధికారులకు దసరా కానుక
వేతనాల పెంపు
- విజ్ఞప్తిని నెరవేర్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- సెప్టెంబర్ 25 నుంచి వర్తింపు
- ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి 30 వేల వరకు లబ్ధి
హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): సింగరేణి అధికారుల(Singareni officials) చిరకాల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇచ్చిన హామీ నెరవేరింది. కోలిండియా(Coal India) తరహా వేతనాలను అమలు చేస్తూ సింగరేణి యాజమాన్యం(Singareni Management) సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్1 నుంచి క్యాడర్7 వరకు ఉన్న సుమారు 1,800 మంది అధికారులకు ప్రయోజనం చేకూరనుంది. సవరించిన బేసిక్ వేతనాలు(Basic wages) 2017 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. అయితే, ఆర్థిక ప్రయోజనాలు సింగరేణి బోర్డు(Singareni Board) ఆమోదం తెలిపిన సెప్టెంబర్ 25, 2026 నుంచి వర్తిస్తాయి.
ఈ పెరిగిన వేతనాలను అక్టోబరు జీతాల నుంచి చెల్లించనున్నారు. సవరించిన వేతనాల అమలుకు సంబం ధించి సంస్థ డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రు సోమవారం సాయంత్రం ఉత్త ర్వులు జారీ చేశారు. కోలిండియాలో వేతన అసమానతల నేపథ్యంలో, మహారత్న సంస్థల వేతన విధానాన్ని తమకు అమలు చేయాలని కోలిండియా అధికారులు కోరారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోలిండియా యాజమాన్యం ఆమోదం తెలిపాయి. అదే విధానాన్ని సింగరేణిలోనూ అమలు చేయాలని సంస్థ అధికారులు రాష్ట్ర డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిపై స్పందించిన భట్టి విక్రమార్క దసరాలోపు అధికారులకు శుభవార్త అందేలా చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జులైలో సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం ఈ అంశంపై సింగరేణి యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా బోర్డు ఆమోదంతో వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, ఇచ్చిన హామీని నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సింగరేణి అధికారుల సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ఇంధన అవసరాల కోసం మరింత అంకితభావంతో బొగ్గు ఉత్పత్తి చేసి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. ఇటీవలే దసరా సందర్భంగా సింగరేణిలోని దాదాపు 39 వేల మంది కార్మికులకు, ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం తీపి కబురుగా రూ. 596 కోట్ల బోనస్ అందించిన విషయం తెలిసిందే. అలాగే డిప్యూటీ సీఎం భట్టి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించి వారికి రూ.5,500 చొప్పున బోనస్‌ను ప్రకటించారు. తాజాగా అధికారుల వేతన సవరణపై ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.