ఆదర్శమూర్తి కొండా లక్ష్మణ్
1969 తెలంగాణ ఉద్యమం బాపూజీ జీవితంలో మరో కీలక అధ్యాయం. ఆ సమయంలో మంత్రిగా ఉన్న ఆయన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రజలపై జరిగిన కాల్పులు, ప్రాంతీయ అసమానతలు అంశాలపై తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రలో కొండా లక్ష్మణ్ బాపూజీది(Konda Laxman Bapuji) ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఆయనను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక న్యాయవాదిగా లేదా చేనేత సమాజ నాయకుడిగా మాత్రమే చూడటం ఆయన సుదీర్ఘ ప్రజా జీవితాన్ని పరిమితం చేయడమే అవుతుంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం, పేదలు.. పీడితుల తరఫున న్యాయపోరాటం, చేనేత కార్మికుల సంఘటితం.
సహకార రంగం అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తిత్వం, వెనుకబడిన వర్గాల సామాజిక న్యాయం.. ఇలా అనేక రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. నమ్ముకున్న విలువల కోసం, సిద్ధాంతం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన ఒక మహావ్యక్తి, ఆదర్శమూర్తి. బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 27న అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామం, పద్మశాలి/చేనేత కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచే సామాజిక స్ఫూర్తి, ఉద్యమ భావాలూ కలిగిన వ్యక్తి.
నిజాం వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర
1940లలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక, పౌరహక్కుల ఉద్యమాలు ఉధృతమవుతున్న సమయంలో బాపూజీ చురుకుగా పాల్గొన్నారు. న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రజా ఉద్యమాలతో ఆయన సంబంధం కొనసాగింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. నిజాం ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో పౌర, ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేశారు.
1947 డిసెంబర్ 4న హైదరాబాద్‌లో నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్ కారుపై నారాయణరావు పవార్ బాంబు విసిరినారు. ఈ చర్యకు సంబంధించిన బృందంతో బాపూజీ మార్గదర్శకుడిగా లేదా సహాయకుడిగా ఉన్నారు. ఈ ఘటనను కేవలం ఒక బాంబుదాడిగా కాకుండా, ఆ కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెరిగిన తీవ్ర ప్రతిఘటనలోని ఒక ఘట్టంగా చూడాలి.
చాకలి ఐలమ్మ కుటుంబానికి న్యాయ సహాయం
కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల తరఫున నిలిపిన మరో ముఖ్యమైన రంగం న్యాయవృత్తి. విస్నూరు దేశ్‌ముఖ్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ కుటుంబం సామాజిక అణచివేతను ఎదుర్కొంది. ఐలమ్మ భర్త చిట్యాల నర్సింహపై నమోదైన కేసుల్లో బాపూజీ న్యాయ సహాయం అందించారు. పాలకుర్తి ప్రాంతానికి సంబంధించిన కేసుల్లో బాధిత గ్రామస్తుల తరఫున కూడా ఆయన వాదించారు.
అందువల్ల ఈ సంఘటనకు ఒక గొప్ప సామాజిక అర్థం ఉంది. ఒకవైపు చాకలి ఐలమ్మ తన భూమి, తన పంట, తన ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, మరోవైపు ఆ కుటుంబానికి న్యాయపరమైన రక్షణ కల్పించడానికి బాపూజీ ముందుకు వచ్చారు.
పేదల తరఫున న్యాయవాది
1940ల నుంచి న్యాయవాదిగా పనిచేసిన బాపూజీ రాజకీయ, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అనేక కేసులను ఫీజు లేకుండా వాదించినట్లు ఆధారాలు పేర్కొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో కేసుల ఖర్చులను కూడా భరించిన గొప్ప మానవతా వాది .
చేనేత రంగానికి జీవితకాల సేవ
బాపూజీ చేనేత కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు మాత్రమే కాదు; చేనేత కార్మికుల ఆర్థిక సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి సంస్థాగత ప్రయత్నాలు చేసిన నాయకుడు. 1943లో చేనేత సంక్షేమ సంఘం ఏర్పాటుకు కృషి చేశారు. చేనేత కార్మికులను సహకార సంఘాల ద్వారా సంఘటితపరిచేందుకు యత్నించారు. 1950 ఫిబ్రవరి 19న హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్స్ సెంట్రల్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ నమోదు చేయబడగా, బాపూజీ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
దేశవ్యాప్తంగా 50కిపైగా చేనేత సహకార -సంఘాల ఏర్పాటుకు కూడా ఆయన కృషి చేశారు. ఇది కేవలం ఒక వృత్తి అభివృద్ధి కార్యక్రమం కాదు. చేనేత కుటుంబాల ఆర్థిక స్వావలంబన, సామూహిక సంస్థాగత శక్తి, మధ్యవర్తులపై ఆధారపడకుండా మార్కెట్లో నిలబడే సామర్థ్యం పెంపొందించాలనే ఆయన ఆలోచన కనిపిస్తుంది. అందుకే ఆయన చేనేత ఉద్యమం సామాజిక న్యాయంతోనూ అనుసంధానమైంది.
గొప్ప మానవతావాది
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, పేదలు రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ బాధితుల తరఫున న్యాయ సహాయం అందించేవారు. అందుకే ఆయన ప్రజా జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం కనిపిస్తుంది. రాజకీయ అనుబంధం ఒక వైపు; అన్యాయానికి గురైన వ్యక్తికి న్యాయం చేయడం మరో వైపు. శాసనసభలో ప్రజా ప్రతినిధిగా 1952లో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నియోజక వర్గం నుంచి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన బాపూజీ,
తరువాత 1957లో చినకొండూరు, 1967, 1972లో భువనగిరి నుంచి శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు. డిప్యూటీ స్పీకర్‌గా(1957- మంత్రిగా (1967 పనిచేశారు. అధికార పదవులు ఆయనకు వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించే సాధనాలుగా ఉన్నాయనే అభిప్రాయం ఆయన ప్రజా జీవితాన్ని పరిశీలించినప్పుడు కనిపిస్తుంది.
పదవి కంటే తెలంగాణకు ప్రాధాన్యం-
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాపూజీ జీవితంలో మరో కీలక అధ్యాయం. ఆ సమయంలో మంత్రిగా ఉన్న ఆయన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రజలపై జరిగిన కాల్పులు, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉద్యమ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో తెలంగాణ చైతన్యాన్ని పెంపొందించడానికి కృషి చేశారు.
ఇక్కడ ఆయన జీవితంలోని మరో విలువ స్పష్టమవుతుంది. పదవి కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమని భావించడం. మలిదశ ఉద్యమ సమయంలోనూ ఆయన తన నివాసమైన జలదృశ్యాన్ని ఉద్యమ కార్యకలాపాలకు వేదికగా అందించారు. ఇది ఒక గొప్ప రాజకీయ సందేశం. ఇల్లు కేవలం నివాసం కాదు.. ప్రజల పోరాటానికి వేదిక కావచ్చు. పదవి కేవలం అధికారం కాదు.. ప్రజల హక్కుల కోసం ఉపయోగించే బాధ్యత కావచ్చు.. బాపూజీ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, మండల్ కమిషన్ అమలు, నేతన్నల సమస్యలు, బహుజన సామాజిక న్యాయం వంటి అంశాలపై కూడా తన స్వరం వినిపించారు.
చేనేత కార్మికుల ఆకలి చావుల సమస్య నుంచి బహుజన రాజకీయ సాధికారత వరకు ఆయన ఆలోచనా పరిధి విస్తరించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీలకు ఎందుకు ఆదర్శం? బీసీ సమాజానికి ఆయన జీవితం ఎందుకు స్ఫూర్తి? బీసీ సమాజం భారతదేశ సామాజిక నిర్మాణంలో అత్యంత పెద్ద భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, చారిత్రకంగా విద్య, ఆర్థిక వనరులు, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ అధికారంలో నామమాత్రపు ప్రాతినిధ్యానికి పరిమితమైనది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ బాపూజీ జీవితం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. వృత్తి చిన్నది కాదు. మనిషి చిన్నవాడు కాదు.
అవకాశాలే అసమానంగా ఉన్నాయి. చేనేత, కమ్మరి, కుమ్మరి, మంగలి, రజక, గౌడ, గొల్ల, కురుమ, మత్స్యకారుడు, నాయీబ్రాహ్మణుడు, వడ్డెర, విశ్వబ్రాహ్మణుడు, పద్మశాలీ, ముదిరాజ్, యాదవ తదితర వృత్తి సమూహాలు శతాబ్దాలుగా సమాజానికి సేవ చేశాయి. కానీ వారి శ్రమకు లభించిన సామాజిక గౌరవం, ఆర్థిక ప్రతిఫలం, రాజకీయ ప్రాతినిధ్యం సమానంగా లేదు. బాపూజీ జీవితం ఈ అసమానతను ప్రశ్నించే దిశలో మనకు స్ఫూర్తినిస్తుంది.
ఆత్మగౌరవం నుంచి అధికార భాగస్వామ్యం వరకు- సామాజిక న్యాయం అంటే కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కాదు. సామాజిక న్యాయం అంటే విద్యలో అవకాశం, ఉద్యోగంలో అవకాశం, ఆర్థిక రంగంలో అవకాశం, రాజకీయాల్లో ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం. ఇదే ఆధునిక బీసీ ఉద్యమం ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచన. కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ప్రజా సమస్యలను కేవలం అధికార పరిధిలో చూడకుండా, ప్రజల ఆకాంక్షలతో అనుసంధానించిన నాయకత్వం కనిపిస్తుంది.
బీసీ ఉద్యమానికి మూడు పాఠాలు-
కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని నేటి బీసీ ఉద్యమంతో అనుసంధానిస్తే మూడు ప్రధాన పాఠాలు కనిపిస్తాయి.
1. ఆత్మగౌరవం మొదట బీసీ సమాజం తనను తాను గౌరవించుకోవాలి. తన వృత్తిని తక్కువగా చూసుకునే సమాజం తన హక్కుల కోసం బలంగా నిలబడలేడు. చేతివృత్తులు, వ్యవసాయ వృత్తులు, ఉత్పత్తి వృత్తులు ఇవన్నీ సమాజ నిర్మాణానికి చేసిన చారిత్రక సేవలుగా గుర్తించాలి. వృత్తికి గౌరవం వృత్తిదారుడికి ఆత్మగౌరవం.
2. ఐక్యత -బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. అయితే ఒక సాధారణ ప్రశ్న ఉంది: మన జనాభాకు అనుగుణంగా మనకు అవకాశాల్లో భాగస్వామ్యం ఉందా? ఈ ప్రశ్న చుట్టూ చర్చ, పరస్పర సహకారం, ప్రజాస్వామ్య ఐక్యత పెరగాల్సిన అవసరం ఉంది. కులాల మధ్య ఉన్న భేదాలను గౌరవిస్తూనే, సామాన్య హక్కుల కోసం, ఉమ్మడి లక్ష్యాలతో ఐక్యంగా పనిచేయడం బీసీ ఉద్యమానికి కీలకం. తమ జనాభా దామాషా ప్రకారం అవకాశాలు పొందటమే నిజమైన ప్రజా స్వామ్యం.
3. అధికారంలో భాగస్వామ్యం- బీసీ ఉద్యమం కేవలం సంక్షేమం వద్ద ఆగకూడదు. మాకు ఏమి ఇస్తారు? అనే ప్రశ్నతో పాటు నిర్ణయాలు తీసుకునే చోట మాకు ఎంత భాగస్వామ్యం ఉంది? అనే ప్రశ్న కూడా ఉండాలి. ఇదే రాజకీయ సాధికారత. ఇదే హుకుమత్ భావన.
హిస్సా.. ఇజ్జత్.. హుకుమత్
హిస్సా.. మన జనాభాకు అనుగుణంగా అవకాశాల్లో భాగస్వామ్యం. ఇజ్జత్.. మన వృత్తికి, మన శ్రమకు, మన సంస్కృతికి, మన మనిషి తనానికి గౌరవం. హుకుమత్ నిర్ణయాధికారంలో సముచిత భాగస్వామ్యం. ఈ మూడు కలిసినప్పుడే సంపూర్ణ సాధికారత సాధ్యమవుతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఈ మూడు విలువలను ఆచరణలోకి తీసుకురావడానికి ఒక చారిత్రక స్ఫూర్తిగా నిలుస్తుంది.
నేటి బీసీ యువతకు బాపూజీ సందేశం
నేటి తరం బీసీ యువత చదవాలి, చరిత్ర తెలుసుకోవాలి. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి. తమ హక్కులను తెలుసుకోవాలి. ప్రజాస్వామ్య సంస్థల్లో పాల్గొనాలి. సమాజ సమస్యలపై ప్రశ్నించాలి. మన కోసం ఎవరో వస్తారు అని ఎదురుచూడకుండా, మన హక్కుల కోసం మనమే ప్రజాస్వామ్య మార్గంలో పోరాడాలి.. అనే చైతన్యం పెంచుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాదు. అది ఒక విలువల పాఠశాల.
ఆత్మగౌరవం కోసం ఎలా నిలబడాలి? ప్రజల కోసం పదవిని ఎలా ఉపయోగించాలి? ప్రజల ఆకాంక్షలకు ఎలా అండగా నిలవాలి? అధికారాన్ని లక్ష్యంగా కాకుండా ప్రజాసేవకు సాధనంగా ఎలా చూడాలి? ఈ ప్రశ్నలకు ఆయన జీవితం సమాధానాలు అందిస్తుంది. ఈ రోజుల్లో పదవుల కోసం ప్రాణాల తీసే రాజకీయ నాయకులున్న కాలంలో, మంత్రి పదవికి రాజీనామా చేసి, తిరిగి ఆ పదవి కోసం వెంపర్లాడని, ఏ పార్టీ గడప తొక్కని ఆత్మాభిమాని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. పదవికంటే సిద్ధాంతం, అధికారం కంటే ఆత్మగౌరవం గొప్పవని తన జీవితంతో నిరూపించిన ఆయన త్యాగానికి, సిద్ధాంత నిబద్ధతకు, ప్రజాసేవకు ప్రతీక. నేటి తరానికి ఆదర్శప్రాయుడు.
ఆయనకు భారతరత్న ఇచ్చి సత్కరించాలని , కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని ప్రజలందరి ఆకాంక్ష. అందుకే నేటి బీసీ ఉద్యమం బాపూజీని కేవలం స్మరణగా కాకుండా స్ఫూర్తిగా స్వీకరించాలి. బీసీ సమాజం తన చరిత్రను తెలుసుకోవాలి. తన శక్తిని గుర్తించాలి. తన హక్కులను అర్థం చేసుకోవాలి. తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ఆత్మగౌరవం కోసం (ఇజ్జత్), అవకాశాల కోసం( హిస్సా,) నిర్ణయాధికారం కోసం( హుకుమత్) ఉద్యమించాలి. ఇదే నేటి బీసీ ఉద్యమానికి దిశ. ఇదే బాపూజీకి నిజమైన నివాళి.