బానిసత్వమే కాంగ్రెస్ నైజం

27-09-2026 | 05:25am
  1. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన ముఖ్యం
  2. నేషన్ ఫస్ట్ బీజేపీ సిద్ధాంతం
  3. ‘గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్‘ వ్యాఖ్యలపై రాంచందర్‌రావు ఫైర్
  4. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అర్ధరహితం
  5. కార్యకర్తల త్యాగాలే సంఘ్ పరివార్ బలమని స్పష్టీకరణ 

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబ బానిసత్వమే నైజమని, దేశ ప్రయోజనాలే బీజేపీకి అత్యున్నత ప్రాధాన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశంలో రాబోయే రాజకీయ పోరు ‘గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్‘ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ స్వార్థ రాజకీయాలకు, సంఘ్ పరివార్ నిస్వార్థ దేశభక్తికి మధ్య ఉన్న తేడాను రేవంత్ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీకి రాజకీయం ఒకే ఒక్క కుటుంబంతో మొదలై, ఆ కుటుంబంతోనే ముగుస్తుందన్నారు. కానీ, బీజేపీకి వ్యక్తి, కుటుంబం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని  స్పష్టం చేశారు. దేశంపై ఎమర్జెన్సీ రుద్ది ప్రజల గొంతు నొక్కింది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. 1984లో దేశ రాజధాని నడిబొడ్డున వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన రక్తచరిత్ర కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని ఆరోపించారు.

ముంబయిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులను పొట్టనబెట్టుకుంటే చేతులెత్తేసిన చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అని విమర్శించారు. 2013 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఐదు దేశాల సరసన నిలబెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పాలనదే అని విమర్శించారు. 

సంఘ్ పరివార్ కుటుంబ వారసత్వంపై నడవదు 

సంఘ్ పరివార్ ఏ ఒక్కరి ఇంటిపేరు మీదో, ఒక కుటుంబం వారసత్వం మీదో నడిచేది కాదని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఎలాంటి పదవులు, పేర్లు ఆశించకుండా కేవలం సమాజ సేవ, దేశ నిర్మాణం, క్రమశిక్షణ కోసం జీవితాలను త్యాగం చేసిన తరతరాల కార్యకర్తల త్యాగాలతో నిలబడిన వ్యవస్థ సంఘ్ అని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న పోలిక అర్థంపర్థం లేనిదన్నారు. దేశ రాజకీయాలు ఎప్పుడూ ’గాంధీ కుటుంబం’ చుట్టూనే తిరగాలని కాంగ్రెస్ కోరుకుంటుందని,

బీజేపీ మాత్రం 140 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం, దేశ ప్రయోజనాల చుట్టూ మాత్రమే తిరగాలని  కోరుకుంటుందన్నారు. ‘ఢిల్లీ, గాంధీ కుటుంబం కాళ్ల దగ్గర పడి తన బానిసత్వాన్ని నిరూపించుకోవడానికి రేవంత్ ఎంతైనా పాకులాడవచ్చు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది కుటుంబ పాలన కాదు.  ప్రజా సంక్షేమం, వంశపారపర్య పెత్తనం కాదు. దేశ ప్రయోజనాలు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు కుటుంబమే సర్వస్వమని, తమకు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలే ప్రథమమని స్పష్టం చేశారు.


మరిన్ని వార్తలు