మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

26-10-2026 | 05:20am
  1. డ్రగ్స్ రహిత సమాజంతోనే వికసిత భారత్
  2. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
  3. బాగ్‌లింగంపల్లి నుంచి అశోక్‌నగర్ వరకు ‘నశా ముక్త్ భారత్’ సైక్లింగ్ రైడ్
  4. అక్షరస్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ

ముషీరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల రహిత(Drug-free) సమాజ నిర్మాణంతోనే ప్రధాని మోదీ ఆకాంక్షించిన వికసిత భారత్ సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు(BJP National Parliamentary Board) సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ అన్నారు. ఆదివారం అక్షరస్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి అశోక్‌నగర్‌లోని స్వామి వివేకానంద విగ్రహం వరకు నిర్వహించిన ‘నశా ముక్త్ భారత్’ సైక్లింగ్ రైడ్‌ను ఆయన ప్రారంభించారు.

స్వయంగా ర్యాలీలో పాల్గొని యువతకు మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మాఫియా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమన్నారు. మాదకద్రవ్యాల వల్ల అనేక పేద, మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు.

డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా సమకూరుతున్న నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఇలాంటి నెట్వర్కులను కూలదోసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, 2047 నాటికి వికసిత భారత్ సాధించాలంటే యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, బీజేపీ యువ నాయకుడు కోవా రాహుల్, జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, సైక్లింగ్ రైడర్లు మూర్తి శశాంక్ రెడ్డి, చేతన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు