మిల్లర్లపై కొరడా!
- రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ మెరుపుదాడులు
- నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 మిల్లుల్లో తనిఖీలు
- 14 మంది అరెస్టు.. మరో ఇద్దరు పరారీ
- సీఎంఆర్ సరఫరాలో భారీగా అక్రమాలు
- సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం సరఫరా
మహబూబాబాద్/హుజూరాబాద్/నిమాజాబాద్/హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్(Custom-milled rice) (సీఎంఆర్) బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. సీఐడీ అధికారులు(CID officials) ప్రత్యే క బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే మెరుపు దాడులకు దిగారు. నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో 14 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు సీఎంఆర్ బకాయిలు, బియ్యం నాణ్యత, ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలపై దర్యాప్తును విస్తృతం చేశారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. 2025 వానాకాలం రాష్ర్టంలోని రైస్ మిల్లులకు 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది.
దీనికి అనుగుణంగా మిల్లర్లు 59.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్, బియ్యం సరఫరా ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ దర్యాప్తు చేపట్టింది.
16 మిల్లుల్లో అవకతవకలు?
నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులకు సంబంధించి 3,385.820 మెట్రిక్ టన్నుల సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బోనస్ రూపంలో ప్రభుత్వానికి సుమారు రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
మరో 45,414.833 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌కు కేటాయించినట్లు పేర్కొంటున్నారు. ఈ కేటాయింపులకు సంబంధించి బోనస్ రూపంలో ప్రభుత్వంపై సుమారు రూ.242 కోట్ల మేర ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
జిల్లాల వారీగా అరెస్టులు ఇలా..
ములుగు జిల్లాలో సీఐడీ అధికారులు పలువురు మిల్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, లేపాక్షి రైస్ మిల్లు యజమాని మోహన్, సాయిరామ్ రైస్ మిల్లు యజమాని రఘోత్తమ్, వాసవి రైస్ మిల్లు యజమాని శ్రవణ్, ఏఎల్‌ఎస్‌ఆర్ రైస్ మిల్లు యజమాని హరినాథ్‌ను అదుపులోకి తీసుకుని వరంగల్‌లోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. గతంలోనే సంబంధిత మిల్లర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల సంస్థలో సాంకేతిక సహాయకులుగా (టెక్నికల్ అసిస్టెంట్లు) పనిచేస్తున్న ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. మిల్లుల నుంచి బియ్యం సేకరణ, గోదాములకు తరలించే సమయంలో నాణ్యతను పరిశీలించడం వీరి విధుల్లో భాగం.
అయితే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని బియ్యాన్ని కూడా సీఎంఆర్ కోటా కింద స్వీకరించేందుకు సహకరించారన్న ఆరోపణలు విచారణలో వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి పౌరసరఫరాల శాఖ డీఎం మనోజ్‌కుమార్ తెలిపారు.
ఇద్దరు టీఏలపై చర్యలు తీసుకోవడంతో ఆ శాఖలో కలకలం రేగింది. గత పదేళ్లలో సుమారు రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉండటంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నలుగురు రైస్ మిల్లు యజమానులను సీఐడీ అరెస్టు చేసింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
పద్మావతి ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని లాబిశెట్టి గంగాప్రసాద్, వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని పొట్ల అంజయ్య, శ్రీవాణి ట్రేడింగ్ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని బొందుగుల దేవేందర్, మాస్టర్ బీహెచ్‌డీఐ ఇండస్ట్రీస్ యజమాని లాబిశెట్టి శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. ముకుందా కృష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని వనపర్తి సూర్యనారాయణ,
అనుపమ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని కీస అనూష పరారీలో ఉన్నట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌లో 150కిపైగా రైస్ మిల్లులు ఉండగా, సుమారు రూ.750 కోట్ల విలువైన బియ్యం పేరుకుపోయింది. ఈ మొత్తం బకాయిల్లో నిర్ధారిత ఎగవేత ఎంతన్నది అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని వరంగల్ రహదారిపై ఉన్న వరలక్ష్మి రైస్ మిల్లు యజమాని కల్లూరు కృష్ణవర్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన నాణ్యమైన సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం ఇచ్చారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు.
జమ్మికుంటలోనూ పలువురు మిల్లర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ వెంకటరమణ మిల్లు, లక్ష్మీసాయి ఇండస్ట్రీస్, రాధాకృష్ణ మిల్లుల యజమానులు ఒలాల మల్లికార్జున్, ఎం.సాని సంపత్, లంకలపల్లి మధును అధికారులు అరెస్టు చేశారు. ఎఫ్‌సీఐకి గ్రేడ్-ఏ రకం బియ్యం సరఫరాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
అధికారుల పాత్రపైనా విచారణ..
సీఎంఆర్ వ్యవహారంలో మిల్లర్లతోపాటు సంబంధిత శాఖల అధికారుల పాత్రపైనా సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్ ప్రక్రియ, బియ్యం నాణ్యత తనిఖీలు, గోదాములకు తరలింపు, ఎఫ్‌సీఐకి సరఫరా వంటి దశల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగాయా? నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా బియ్యం సరఫరా చేసినప్పుడు సంబంధిత అధికారులు వాటిని ఎలా ఆమోదించారు?
బకాయిలు పేరుకుపోయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అక్రమాల వెనుక ఇతర వ్యాపారుల ప్రమేయం ఉందా? అన్న అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.