తెరపైకి మరో వివాదం!

25-10-2026 | 08:29pm

ముంబైలో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ప్రముఖ గాయని శిల్పా రావు(Singer Shilpa Rao)కు ఎదురైన అనుభవం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అక్టోబర్ 24న జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రదర్శన మధ్యలోనే ఆగిపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మైక్రోఫోన్, ఆడియో సమస్యలతో ఇబ్బంది పడిన శిల్పా.. తన షెడ్యూల్ ప్రకారం సుమారు 30 నిమిషాలు పాడాల్సి ఉండగా, 15 నుంచి 18 నిమిషాలకే ప్రదర్శన ముగించాల్సి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో నిర్వాహకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

కర్ఫ్యూ నిబంధనలే కారణమా?

ఈవెంట్ షెడ్యూల్ కంటే సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా నడవడం, రాత్రి 10 గంటల కర్ఫ్యూ నిబంధనలు నిర్వాహకులకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. శిల్పా రావు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనూ కార్యక్రమం కొనసాగిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామంతో #JusticeForShilpaRao హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇతర పురుష కళాకారులకు ఎక్కువ సమయం ఇచ్చారంటూ కొందరు ప్రేక్షకులు ఆరోపించడంతో ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది.

ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. చర్యలకు మద్దతు

ఈ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్(All Indian Cine Workers Association) స్పందించింది. శిల్పా రావు పట్ల వ్యవహరించిన తీరును తప్పుబడుతూ, కళాకారులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని పేర్కొంది. అవసరమైతే చట్టపరమైన మార్గాల్లోనూ మద్దతు ఇస్తామని వెల్లడించింది. మరోవైపు, ఫెస్టివల్ నిర్వాహకులు జరిగిన పరిణామాలపై క్షమాపణలు చెప్పారు. ఇతర ప్రదర్శనలు ఆలస్యం కావడం, వేదికపై అమలులో ఉన్న కఠినమైన సమయ పరిమితుల కారణంగా శిల్పా రావు షో అనుకున్న విధంగా సాగలేదని వివరణ ఇచ్చారు. ఆమె ప్రదర్శన పూర్తిస్థాయిలో జరగకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

కుట్లే ఖాన్ బృందం ఏమంటోంది?

ఈ వివాదంపై కుట్లే ఖాన్ మేనేజర్ శరద్ శర్మ మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న కథనం వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. శిల్పా రావు తన ప్రదర్శన ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడేందుకు తిరిగి రాలేదని, ఆమె మాట్లాడేందుకు అవకాశం కల్పించేందుకు కుట్లే ఖాన్ తన ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారని పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

‘ముంబై.. మళ్లీ వస్తా’ అంటూ శిల్పా భావోద్వేగ పోస్ట్

ఈ పరిణామంపై శిల్పా రావు కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఆ రాత్రి తనకు ఎంతో బాధ కలిగించిందని, అందమైన సంగీత అనుభవం అసంపూర్తిగా మిగిలిపోయిందని భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. సంగీతం ఆగిపోయినా, తన పేరును పిలుస్తూ అభిమానులు చూపించిన ప్రేమ మాత్రం తనను చేరిందని తెలిపారు. ముంబై ప్రేక్షకుల ముందుకు మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహణ, కళాకారుల పట్ల గౌరవం, కార్యక్రమ సమయ నిర్వహణ అంశాలపై చర్చకు దారితీసింది.

మరిన్ని వార్తలు