కొరియా కంపెనీలకు ఆహ్వానం
- ఆ దేశ సంస్థలతో భాగస్వామ్యానికి సిద్ధం
- సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి ప్రాధాన్యం
- ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఔషధ రంగాల్లో పెట్టుబడులకు కూడా..
- కొరియా సాంస్కృతిక దినోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కొరియా సంస్థల పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఉద్యోగాల కల్పన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, యువత నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు,
ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో కొరియా సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించిన ‘కె హార్మనీ ఫెస్టా’ కొరియా కల్చర్ డే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
2024లో సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటనతో ఇరు ప్రాంతాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాది పడిందని భట్టి పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొరియా ఆర్థిక ప్రగతి నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని..
విద్య, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికతపై నిరంతర పెట్టుబడులు అభివృద్ధికి దోహదపడతాయన్నారు. పరిశ్రమలతో పాటు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు, చిన్న పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. పర్యాటక రంగంలోనూ కొరియా పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు.
తెలంగాణ పర్యాటక రంగం కోసం రూ.15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, అదనంగా మూడు లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యమని భట్టి వెల్లడించారు. పర్యాటక మౌలిక సదుపాయాలు, ఆతిథ్య రంగం, చలనచిత్ర పర్యాటకం, వెల్నెస్ టూరిజం, సాంస్కృతిక అనుభవాల అభివృద్ధిలో కొరియా సంస్థల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
భారత్ మధ్య సాంస్కృతిక బంధం
కొరియా సంస్కృతి, కళలు, సంగీతం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుక రెండు దేశాల ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. సాంకేతికత, తయారీ, విద్య, ఆవిష్కరణల్లో ఆ దేశం సాధించిన విజయాలు ప్రశంసనీయమన్నారు. కొరియన్ సంగీతం, సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్నాయన్నారు.
భారత్, కొరియా ప్రజల మధ్య విద్య, కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవం వంటి అంశాల్లో సారూప్యతలు ఉన్నాయని తెలిపారు. విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలయికకు హైదరాబాద్ శతాబ్దాలుగా కేంద్రంగా నిలిచిందని చెప్పారు. బతుకమ్మ, బోనాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలు తెలంగాణ ప్రత్యేకతలని వివరించారు.
చార్మినార్, గోల్కొండ కోట, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయం సహా రాష్ట్రంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం వంటి బౌద్ధ వారసత్వ ప్రదేశాలు భారత్, తూర్పు ఆసియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయగలవన్నారు.
కొరియా పర్యాటకులు తెలంగాణను సందర్శించాలని, ఇరు ప్రాంతాల యువత చదువు, పరిశోధన, ఉద్యోగాలు, సృజనాత్మక రంగాల్లో పరస్పరం అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. భట్టి విక్రమార్కకు భారతదేశంలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్.ఈ. లీ సియుంగ్-హో స్వాగతం పలికారు.