270 కోట్ల విలువైన భూముల్లో ఇళ్లు

13-11-2026 | 05:40am
  1. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్ల నిర్మాణం
  2. వచ్చే దీపావళి నాటికి పూర్తి చేస్తాం
  3. క్యూర్ పరిధిలో 23 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టులు
  4. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 
  5. పేదల సంక్షేమమే ప్రాధాన్యం
  6. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  7. జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన
  8. రాజేంద్రనగర్‌లో లక్కీ డ్రా ద్వారా ఇళ్ల కేటాయింపు

రాజేంద్రనగర్, నవంబరు 12 (విజయక్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎకరాకు 270 కోట్ల రూపాయల విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. నగరంలో అత్యంత విలువైన భూముల్లోనూ ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తున్నామని తెలిపా రు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 23 నియోజకవర్గాల్లో చేపట్టిన ఈ నిర్మాణాలను వచ్చే దీపావళి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు.

గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్‌పల్లి, నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజేంద్రనగర్‌లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా, కేటాయింపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది ప్రజలు, లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎకరాకు రూ.250 కోట్ల నుంచి రూ.270 కోట్ల వరకు విలువ చేసే భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. పేదలను నగరానికి దూరంగా తరలించకుండా, వారు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో గృహాలు నిర్మించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పమన్నా రు.

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కుల, మత, రాజకీయ వివక్షకు తావులేకుండా అర్హులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. రాజేంద్రనగర్‌లో చిన్నారి చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం పారదర్శకతకు నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 2,21,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చామని వెల్లడించారు. ఈ నెల 19 నుంచి ఆడబిడ్డలకు చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.

పేదల సంక్షేమమే ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు

పేదల సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరానికి దూరంగా కాకుండా విలువైన భూముల్లోనే పేదలకు ఇళ్లు నిర్మిం చి ఇవ్వడం ద్వారా వారి జీవన ప్రమాణాల ను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇళ్లు కేటాయిస్తామని, మొదటి విడతలో రానివారు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి,  టి ప్రకాశ్‌గౌడ్, హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్, కలెక్టర్ సి నారాయణరెడ్డి, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్, హౌసింగ్ పీడీ చంప్లా నాయక్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ పారిజాతం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు