రాచకాలువను మింగేశారు..!

13-11-2026 | 05:30am
  1. శ్రీమాత వెంచర్‌లో ఆ కాలువను కబ్జా చేసినట్లు ఆరోపణలు
  2. కాలువ స్థలంలోనే 10 శాతం ఓపెన్ స్పేస్, గార్డెన్ ఏర్పాటు 
  3. కాలువ ప్రవాహాన్ని వ్యవసాయ బావిలోకి మళ్లించిన  రియల్ ఎస్టేట్ సంస్థ
  4. గతంలో ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు

అబ్దుల్లాపూర్‌మెట్ / ఇబ్రహీంపట్నం, నవంబర్ 12: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వం నీటి పొదుపు, జలవనరుల పరిరక్షణపై దృష్టి సారించింది. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను అరికట్టాలని సూచిస్తుంది. అయితే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా రాచకాలువనే కబ్జా చేసినట్లు ఓ రియల్ ఎస్టేట్(Real Estate) సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 246 247లో సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ హెచ్‌ఎండీఏ అనుమతులతో వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ భూముల మీదుగా గతంలో ప్రవహించిన రాచకాలువ ప్రస్తుతం కనుమరుగైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నీటి ప్రవాహానికి అడ్డుకట్ట..

గతంలో ఈ రాచకాలువ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు నీటిని అందించే ప్రధాన వనరుగా ఉండేదని స్థానికులు తెలిపారు. బొంతపల్లి కుంట నుంచి మొగుళ్ల కుంటకు, అక్కడి నుంచి అలీమియా కుంట, అనంతరం గోశాల కుంటకు నీరు చేరేదని, ఈ నీటిని రైతులు సాగు అవసరాలకు వినియోగించుకునేవారని  స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం కాలువ ఆనవాళ్లు లేకుండా పోవడంతో సహజ నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కాలువల ఆక్రమణలు కొనసాగితే భవిష్యత్తులో భారీ వర్షాల సమయంలో వరదనీరు జనావాసాలు, వ్యవసాయ భూముల్లోకి చేరి ముంపుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాలువ స్థలంలోనే ఓపెన్ స్పేస్..

శ్రీమాత ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం రాచకాలువను ధ్వంసం చేసి, దాని అసలు ఆనవాళ్లను తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో కాలువ ప్రవాహ మార్గాన్ని మార్చి, వెంచర్ను ఆనుకుని ఉన్న వ్యవసాయ బావిలోకి మళ్లించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా కాలువకు సంబంధించిన స్థలంలోనే ప్రజా ప్రయోజనాలకు కోసం వెదిలేయాల్సిన 10 స్థలాన్నికాలువలో స్థలంలో పార్కు, గార్డెన్ వంటివి  చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రయోజనాల కోసం కేటాయించాల్సిన స్థలాన్ని కాలువ స్థలంతో కలిపి చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ప్రవహించాల్సిన నీటి మార్గాన్ని మార్చడం వెనుక ఉద్దేశాలేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అనుమతులపై అనుమానాలు..

వెంచర్కు హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిబంధనలు పాటించారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాచకాలువ విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్‌ఓసీ ఎలా జారీ చేశారు? కాలువ అసలు స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారా? వెంచర్ లేఅవుట్లో కాలువ వివరాలను ఎలా నమోదు చేశారు? అనే ప్రశ్నలు స్థానికంగా నిపిస్తున్నాయి.

ఫిర్యాదులు చేసినా చర్యలేవీ?

ఈ వ్యవహారంపై గతంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరుతున్నారు. పాత రెవెన్యూ రికార్డులు, కాలువ మ్యాపులు, వెంచర్ లేఅవుట్, అనుమతులు పరిశీలించి రాచకాలువ అసలు స్థితిగతులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.  

రాచకాలువను రక్షించాలి..

సాగు, తాగు నీటిని అందించే రాచకాలువను రక్షించాలి. ఈ కాలువ కబ్జాపై గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే. కబ్జాలకు గురై కాలువను కాపాడి పూర్వవైభవం తీసుకురావాలి. వనరులను అడ్డుకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకమే.

 కావలి సురేష్, 

సీపీఐ ఇబ్రహీంపట్నం 

మండల కార్యదర్శి

మరిన్ని వార్తలు