జూన్‌లోగా టిమ్స్
- సీఎం రేవంత్‌రెడ్డి డెడ్‌లైన్
- అల్వాల్, ఎల్‌బీనగర్ టిమ్స్‌ను త్వరగా పూర్తిచేయండి
- నిమ్స్ విస్తరణ, వరంగల్ ఆస్పత్రికీ అదే గడువు
- ఏడాదిలోగా కొత్త ఉస్మానియా హాస్పిటల్ 3 టిమ్స్‌లకు ఏకీకృత నియామకాలు
- పరికరాల కొనుగోలు, నియామకాలు ఏకకాలంలో పూర్తికావాలి
- వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): వచ్చే ఏడాది జూన్ 2 నాటికి అల్వాల్, ఎల్‌బీనగర్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మా ణ పనులు, నిమ్స్ విస్తరణ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అలాగే వైద్య పరికరాల కొనుగోలు, వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
వైద్య, ఆరోగ్య శాఖపై గురువారం ఎంసీహెచ్‌ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీ నగర్ టిమ్స్ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు ఏకీకృత విధానం అమలు చేయాలని సీఎం సూచించారు. వైద్య సేవల అవసరాలను బట్టి మూడు ఆసుపత్రుల మధ్య వైద్యులు, సిబ్బందిని పరస్పరం బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల నిర్వహణ, హౌస్‌కీపింగ్ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టాలని ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రుల పర్యవేక్షణకు గ్రూప్ అధికారులను, హౌస్‌కీపింగ్ సిబ్బంది పర్యవేక్షణకు విశ్రాంత సైని కాధికారులను నియమిస్తామని సీఎం తెలిపారు.
నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలకు ప్రత్యేక సిబ్బంది ఉంటే వైద్యులు పూర్తిస్థాయిలో రోగులకు చికిత్స అందించడంపై దృష్టి సారించగలరని సీఎం అభిప్రాయపడ్డారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్స కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. మూడేళ్లలో తొమ్మిది మెడికల్, 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య రంగంలో చేపట్టిన విస్తరణకు అనుగుణంగా ఆసుపత్రుల నిర్మాణాలు, సిబ్బంది నియామకాలు, పరికరాల సమకూర్పులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించండి
నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు సమయం ఎక్కువ తీసుకుంటున్నందున సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. టిమ్స్‌లో వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి నుంచి నియమించుకోవాలని, అందుకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు.
టిమ్స్‌తో పాటు బోధన కళాశాలలు, నర్సింగ్ కళాశాలల పనులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఏకకాలంలో పూర్తవ్వాలని, అందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యులు, సిబ్బంది హాజరైన సమయం, విధుల నుంచి వెళ్లే సమయాన్ని నమోదు చేయాలని, బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఏఐతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, మరో 79 డయాలసిస్ సెంటర్ల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై పెరుగుతున్న నమ్మకం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను మూడేళ్లలో 30 వేల నుంచి 38 వేలకు పెంచినట్లు అధికారులు సీఎంకు వివరించారు. రోగుల సంఖ్య పెరిగినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఔట్ పేషెంట్ల సంఖ్య 7 లక్షల నుంచి 9 లక్షలకు, ఇన్‌పేషెంట్లు 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరగడం ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయతకు నిదర్శనమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి గతంలో సగటున 3.9 శాతం కేటాయించగా, మూడేళ్లుగా సగటున 4.8 శాతం నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు.
వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారా మెడికల్ సిబ్బందితో కలిపి 13,401 నియామకాలు చేపట్టామని, మరో 5,640 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతుందని సీఎం వెల్లడించారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే క్రమంలో వైద్యారోగ్య శాఖకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని స్పష్టం చేశారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోంగ్తూ, టీజీఎంఎస్‌ఐడీసీ కార్యదర్శి డాక్టర్ గౌరవ్‌ఉప్పల్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఆర్ అండ్ బీ కార్యదర్శి ఇలంబర్తి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పాల్గొన్నారు.