ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు!
- ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకోలు
- తల్లికి తోడుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న కూతురు
- రేకుల ఇంట్లో దీనావస్థ.. వర్షం వస్తే ఇల్లంతా నీరే..
కంగ్టి, నవంబర్ 12: ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపన్నహస్తాల కోసం ఓ నిరుపేద తల్లీకూతుళ్లు దీనంగా ఎదురుచూస్తున్నారు. కన్నీళ్లే కష్టాలకు సాక్ష్యాలుగా మారిన వారి జీవితాల్లో వెలుగులు నింపేవారి కోసం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వ సాయం అందక కనీస అవసరాలు తీర్చుకోలేక దుర్భర జీవితం గడుపుతున్న ఈ తల్లీకూతుళ్ల పరిస్థితి హృదయాలను కలచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కంగ్టి మండలం చాప్టా(కే) గ్రామానికి చెందిన గైని చంద్రవ్వకు ఒక్కగానొక్క కూతురు బుచ్చమ్మ.
తండ్రి హనుమయ్య మరణించడంతో తల్లీకూతుళ్లకు అండగా నిలిచే వారు లేకుండా పోయారు. కూతురు మానసిక సమస్యలతో బాధపడుతుండటంతో ఆమె ఆలనాపాలనా చూసుకుంటూ చంద్రవ్వ కాలం వెళ్లదీస్తోంది. వయసు మీదపడుతున్నా కూతురి బాధ్యతను మోస్తూ కాలం నెట్టుకొస్తోంది. పింఛన్ వచ్చినా ప్రయోజనం శూన్యం. ప్రభుత్వం అందించే నెలవారీ పింఛనే వీరి జీవనాధారం. అయితే డబ్బుల విలువ, లెక్కలు, కొనుగోలు వ్యవహారాలపై అవగాహన లేకపోవడంతో పింఛన్ వచ్చిన రోజే డబ్బులు ఖర్చయిపోతున్నాయని వారి పరిస్థితి తెలియజేస్తోంది. కిరాణా దుకాణానికి వెళ్లినా, వారపు సంతలో కూరగాయలు కొనుగోలు చేసినా ఇచ్చిన నోటుకు సరైన చిల్లర తీసుకోవడం, లెక్కలు చూసుకోవడం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేతిలో డబ్బు నిలవక నిత్యావసరాల కోసం కూడా అవస్థలు తప్పడం లేదు.
వర్షం వస్తే ఇల్లంతా నీరే..
వీరు నివసిస్తున్నది రేకులతో కప్పిన చిన్నపాటి గుడిసె. కనీస సౌకర్యాలు లేని ఆ ఇంట్లో వర్షం కురిస్తే నీరు ఇంట్లోకి చేరి జీవనం మరింత దుర్భరంగా మారుతోంది. వంటగ్యాస్ వంటి కనీస సదుపాయాల గు రించి కూడా వారికి సరైన అవగాహన, అ ందుబాటు లేదని స్థానికులు చెబుతున్నారు. సురక్షితమైన ఇల్లు లేక ప్రతి రోజూ అభద్రత మధ్యనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తల్లీకూతుళ్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలి ంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హతను పరిశీలించి ఇల్లు మంజూరు చేయడంతో పాటు, అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక, వైద్య, సామాజిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.